ఆరు దశాబ్దాలుగా రకరకాల రూపాల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజలు తెలియజేశారని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా మాట్లాడిన రేవంత్..ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆనాడు సోనియాగాంధీ ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారని వివరించారు.'తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009, డిసెంబర్ 9న ప్రకటించారు. అందుకే డిసెంబర్ 9కి ఎంతో ప్రాధాన్యత ఉంది. అధికారికంగా ఇప్పటి వరకు తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రకటించలేదు. ప్రజల ఆకాంక్షలు గౌరవించలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఉద్యమ సందర్భంలో యువత గుండెలపై రాసుకున్న టీజీ అక్షరాలను వాహనాలకు పెట్టుకున్నాం. ఉద్యమ కాలంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని మన రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నాం' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వజ్ర వైఢూర్యాలతో, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా? తల్లిలా ఉండాలా అని ప్రస్తావన వచ్చినప్పుడు.. తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించారు. తెలంగాణ తల్లిని చూస్తే.. మన తల్లిని చూసిన స్ఫురణ కలిగేలా బహుజనుల తెలంగాణ తల్లిని ఇవాళ ప్రతిష్ఠించుకోబోతున్నాం' అని ముఖ్యమంత్రి వివరించారు.
'నాలుగుకోట్ల తెలంగాణ సమాజమంతా ఏకమై ఇవాళ పండగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నాం. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు. ఒక వ్యక్తి, ఒక పార్టీ ఆలోచనే తెలంగాణ సమాజం ఆలోచన అనుకోవడం తప్పు. మధ్య యుగాల చక్రవర్తులు పాలనలా ఇవాళ నడవదు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుకోబోతున్నాం' అని సీఎం ప్రకటించారు.
'ఈ ఒక్కరోజు తెలంగాణ సమాజం కోసం సమయం ఇద్దాం. ఇవాళ వివాదాలకు తావు ఇవ్వొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతీ సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుందాం. దేవత ఆశీర్వదిస్తుంది.. తల్లి ప్రేమను అందిస్తుంది. ఆ తల్లి అవతరణ ఉత్సవాలను గొప్పగా జరుపుకుందాం' అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
'ఈ రోజు సోనియాగాంధీ 78వ జన్మదినం. ఈ సందర్భంగా ఈ సభ తరఫున, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ఆమెకుహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంతో, ఇక్కడ ప్రజలతో సోనియాగాంధీది విడదీయలేని అనుబంధం. 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, మన దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa