హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు. త్వరలోనే నీటి సరఫరా సమస్యలకు చెక్ పడనుంది. ఈ మేరకు జలమండలి అధికారులు సరికొత్త ఆలోచన చేశారు. అందుకు కార్యచరణను సిద్ధం చేస్తోంది. క్షేత్ర స్థాయిలో నీటి సరఫరాలో కీలకమైనని నీటి వాల్వ్‌లు. వాటి నిర్వహణను మనుషుల ప్రమేయం లేకుండా సెన్సర్లతో ఆటోమేటిక్ విధానంతో నిర్వహించేందుకు జలమండలి కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ జలమండలి పరిధిలో నీటి సరఫరా అంతకంతకూ పెరుగుతుంది. పరిధి విస్తరించడంతో సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆపరేటర్లు వెళ్లి పరిశీలించి సమస్యలకు పరిష్కరించేవారు. ఇక నుంచి నీటి సమస్యలకు చెక్ పెట్టేందుకు స్మార్ట్‌గా పని చేయించనున్నారు. ఈ అంశంపై ఇటీవల జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె.అశోక్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రస్తుతం ఆపరేటర్లు నిర్వహిస్తున్న విధానంలోనూ పలు సమస్యలు ఉన్నట్లు జలమండలి అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆపరేటర్లు వాల్వ్‌లను సరి చేయడంలో ఓ విధానమంటూ లేదని అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో నీటి సరఫరాకు ఏ పద్ధతి లేకుండా పోయింది. వాల్వ్‌లను నిర్వహించే లైన్‌మెన్లు సైతం స్థానికంగా ఉండటం లేదు. అందుకే నీటి సరఫరా సమయపాలన గందరగోళంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వాటికి చెక్ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న నీటి వాల్వ్‌ల స్థానంలో ఆటోమెటిక్ స్మార్ట్‌వాల్వ్‌లను జలమండలి అధికారులు ఏర్పాటు చేయనున్నారు. వీటికి ఆపరేటర్ల నిర్వహణ అవసరం ఏమాత్రం ఉండదని చెబుతున్నారు. సెన్సర్లతో ఉండే వాల్వ్‌లను ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్‌కు అనుంధానం చేయనున్నారు. మెుబైల్ ద్వారా నీటి విడుదల వంటివి చేయనున్నారు. దీని ద్వారా నీటి సమస్యలకు చెక్ పడుతుందని జలమండలి అధికారులు చెబుతున్నారు.
త్వరలోనే హైదరాబాద్ నగరంలోని నీటి కనెక్షన్లకు స్మార్ట్ వాల్వ్‌లు అమరుస్తామని జల మండలి అధికారులు చెబుతున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే నగరంలో నీటి సమస్యలకు ఇబ్బందులు తొలిగిపోతాయని అంటున్నారు. సమ్మర్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా నీటి సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జలమండలి అధికారులు వెల్లడించారు.