హైదరాబాద్ శివారులోని జల్ పల్లిలో ప్రముఖ నటుడు మోహన్ బాబు నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఈ సాయంత్రం మంచు మనోజ్, మౌనిక దంపతులు పోలీసు ఉన్నతాధికారులను కలిసి వచ్చాక మోహన్ బాబు నివాసం వద్ద వాడీవేడి వాతావరణం నెలకొంది. మంచు మనోజ్ బలవంతంగా గేటు తోసుకుని ఇంట్లోకి ప్రవేశించారు. అయితే, ఆయన తిరిగి బయటికి వచ్చేటప్పుడు చొక్కా చిరిగి ఉంది. దీన్నిబట్టి లోపల ఘర్షణ జరిగి ఉంటుందని తెలుస్తోంది. కాగా, ఈ వ్యవహారంపై కవరేజీ ఇవ్వడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేసిన విజువల్స్ దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. మంచు మనోజ్ తో పాటు ఓ రిపోర్టర్ కూడా ఇంట్లోకి ప్రవేశిచంగా, ఆ రిపోర్టర్ నుంచి మైక్ లాక్కున్న మోహన్ బాబు... మీడియా ప్రతినిధిని కొడుతూ బయటికి తరిమేసే ప్రయత్నం చేశారు. మోహన్ బాబు ఉగ్రరూపం చూసిన విలేకరులు భయబ్రాంతులకు గురయ్యారంటే అతిశయోక్తి కాదు.