దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని పుష్ప-2 నటి గార్లపాటి కల్పలత సందర్శించారు. ఈరోజు (డిసెంబర్ 12న) తెల్లవారుజామున.. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. ఆలయ అర్చకులు ఆమెకు లడ్డు ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అయితే.. గార్లపాటి కల్పలత స్వామివారి దర్శించుకున్న సందర్భంలో.. కాషాయ వేషధారణ, మెడలో రుద్రాక్ష మాలలతో కనిపించారు. దీంతో.. కల్పలత ఏదైనా దైవమాలలో ఉన్నారా.. లేదా రాజన్న దర్శనం కోసం ఇలా వచ్చారా అన్నది ప్రస్తుతం చర్చించుకుంటున్నారు.
పుష్ప, పుష్ప-2 సినిమాల్లో హీరో అల్లు అర్జున్‌కు తల్లిగా నటించారు గార్లపాటి కల్పలత. పుష్పరాజ్ తల్లిగా ఆమె ఎమోషనల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కొన్ని సీన్లలో ప్రేక్షకులను కూడా భావోద్వేగానికి గురయ్యేలా నటించి మెప్పించారు కల్పలత. మొదటి భాగంలో నిరుపేద తల్లిగా, కుటుంబం వెలివేస్తే దూరంగా బతుకుతున్న ఓ ఇల్లాలిగా కల్పలత.. తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అయితే.. రెండో భాగంలో కూడా తనదైన నటనతో మెప్పించారు.
అయితే.. సినిమాల్లో ఓ తల్లిగా, మధ్యతరగతి ఇల్లాలిగా, ఎమోషనల్ పాత్రల్లో కనిపిస్తూ.. తన నటనతో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసే కల్పలత. ఉన్నట్టుండి ఇలా ఆధ్యాత్మికంగా మారిపోయి, కాషాయ వేషధారణలో కనిపించింది. సినిమాల్లో ఎమోషనల్ క్యారెక్టర్లలో.. బయట మాత్రం ట్రెండీగా కనిపించే కల్పలత.. ఒక్కసారిగా ఇలా ఆధ్యాత్మికంగా కనిపించటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన గార్లపాటి కల్పలత.. అల్లు అర్జున్ నటించిన వేదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. సుమారు 40 వరకు సినిమాల్లో నటించారు. అయితే.. చాలా వరకు సినిమాల్లో తల్లి పాత్రలు పోషిస్తున్న కల్పలత.. గుండెలు బరువెక్కించి కన్నీళ్లు తెప్పించే నటనతో ప్రేక్షకులకు చేరవయ్యారు. ఎక్కువ శాతం ఎమోషనల్ పాత్రల్లోనే కల్పలత కనిపిస్తూ మెప్పిస్తుండటం గమనార్హం. బీద మహిళగా, మధ్యతరగతి తల్లిగా పలు పాత్రల్లో కల్పలత జీవిస్తూ.. తనకంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కల్పలత.