ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైలులో లగచర్ల రైతుకు గుండెనొప్పి.. బేడీలు, గొలుసులతో ఆస్పత్రికి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 12, 2024, 07:13 PM

తెలంగాణలో మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా జైలులో ఉన్న లగచర్ల రైతుకు గుండెనొప్పి రాగా.. సదరు రైతును బేడీలు వేసి మరీ ఆస్పత్రికి తీసుకురావటం ఇప్పుడు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. లగచర్ల దాడి ఘటనలో అరెస్టయిన 45 మంది రైతులను సుమారు 30 రోజులుగా.. సంగారెడ్డి జైలులో ఉంటారు. ఈ క్రమంలోనే హీర్యా నాయక్ అనే రైతుకు గుండెనొప్పి వచ్చింది. తీవ్ర అస్వస్థతతకు గురికావటంతో అప్రమత్తమైన జైలు అధికారులు హీర్యానాయక్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స కోసం తీసుకొచ్చిన రైతును పోలీసు జీపులో.. చేతులకు బేడీలు, గొలుసులతో కట్టేసి మరీ తీసుకొచ్చారు. అదే గొలుసులతో ఆస్పత్రిలోపలికి నడిపించుకుపోయారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారు.


కాగా.. ఇదే ఘటనపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. గుండెనొప్పి వచ్చిన రైతుబిడ్డ హీర్యా నాయక్‌కు బేడీలు వేయడం అమానవీయమని.. రేవంత్ రెడ్డి కూృర మనసత్వానికి నిదర్శనమని కేటీఆర్ దుయ్యబట్టారు. గుండెనొప్పి వచ్చిన రైతుబిడ్డకు బేడీలు వేసి అన్యాయంగా, అమానవీయంగా ఆసుపత్రికి తీసుకొచ్చిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సిన మనిషిని బేడీలు వేసి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. ఇంతటి దుర్మార్గమైన అమానవీయమైన ప్రవర్తన క్షమార్హం కాదన్నారు. రాజ్యాంగంలోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం వారి హక్కులను హరించడమేనన్నారు. నూతన క్రిమినల్ చట్టం బీఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా, పోలీస్ మాన్యువల్స్, జైల్ మాన్యువల్స్ ప్రకారం అండర్ ట్రావెల్స్ ఖైదీల హక్కులను హరించడమేనని తెలిపారు.


రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర గవర్నర్ ఈ అంశంలోని తగిన విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బేషజాలకు పోకుండా గిరిజనులను రైతన్నలపై నమోదైన కేసులను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తనపైన ఎలాంటి దాడి జరగలేదని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్పారని.. కానీ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకొని వారిపై కేసులు పెట్టించారని కేసీఆర్ ఆరోపించారు. ఆయన అహంకారం దెబ్బతిన్నదని, ప్రతిష్టకు తీసుకొని అదే రోజు 17 మంది రైతన్నలను అరెస్ట్ చేయించారని తెలిపారు. అదుపులోకి తీసుకున్న రైతన్నలందరిని పోలీసులు థర్డ్ డిగ్రీ టార్చర్ చేసినట్టుగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com