నేను మీడియా ప్రతినిధిని కొట్టిన మాట నిజమే... కానీ ఏ సందర్భంలో కొట్టానో ఆలోచించాలని, అయినప్పటికీ అలా కొట్టినందుకు చింతిస్తున్నానని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఆసుపత్రి నుంచి విడుదలయ్యాక వెల్లడించారు. ఈ మేరకు 11 నిమిషాల నిడివి గల జర్నలిస్ట్‌ను కొట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ప్రశ్నించారు. ప్రజలు, రాజకీయ నాయకులు దీనిపై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తన ఇంట్లోకి దూసుకొచ్చేవారు జర్నలిస్టులా? కాదా? తనకు తెలియదని వ్యాఖ్యానించారు. మీడియాను అడ్డు పెట్టుకొని తనపై దాడి జరగవచ్చని భావించానన్నారు. జరిగిన ఘటనకు మనస్ఫూర్తిగా చింతిస్తున్నట్లు తెలిపారు. తాను కొట్టడం తప్పే కావొచ్చు... కానీ ఏ సందర్భంలో అలా చేశానో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. మీ ఇంట్లో ఎవరైనా దూరితే... మీ ఏకాగ్రతను భగ్నం చేస్తే అంగీకరిస్తారా?... న్యాయాధిపతులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, వ్యాపారస్తులు, మీడియా ప్రతినిధులు దీనిపై ఆలోచించాలన్నారు. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలిందన్నారు. అందుకు బాధపడుతున్నానని... ఆ మీడియా ప్రతినిధి తనకు తమ్ముడి లాంటి వాడన్నారు. మీడియా ప్రతినిధి భార్యాబిడ్డల గురించి తాను ఆలోచించానని... కానీ తన గురించి ఎవరూ ఆలోచించలేదన్నారు. తాను సినిమాల్లో నటిస్తానని... నిజజీవితంలో మాత్రం నటించాల్సిన అవసరం లేదన్నారు.మీకు టీవీలు ఉన్నాయి... మాకు టీవీలు (చానళ్లు) లేవు... రేపు నేను కూడా టీవీని పెట్టవచ్చు... అది కాదు గొప్ప... కానీ మీడియా ప్రతినిధి మనసును గాయపర్చినందుకు చింతిస్తున్నానన్నారు. మనసును గాయపెట్టాక చింతించి లాభం ఏమిటని ఎవరైనా అడిగితే ఇక నేనేం చేయను... మీరు చేసిందేమిటని ప్రశ్నించారు. మళ్లీ మళ్లీ చెబుతున్నాను... అసలు అతను నిజంగా జర్నలిస్టా? కాదా? అని నాకు ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. కొట్టడం తప్పైనప్పటికీ ఏ సందర్భంలో కొట్టానో చూడాలన్నారు. కానీ మీరు ఈ విషయాలు చెప్పడం లేదన్నారు. పైన భగవంతుడు చూస్తున్నాడని పోలీసులు అంటే తనకు ఇష్టమని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. తన విశ్వవిద్యాలయం నుంచి ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారన్నారు. వారికి తన విద్యాసంస్థల నుంచి న్యాయం, ధర్మం నేర్పించానన్నారు. తన విద్యాసంస్థల నుంచి వెళ్ళి ఉద్యోగం చేస్తున్న వారు న్యాయంగా ఉన్నారని, కానీ ఇక్కడ మాత్రం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నేను చేసింది న్యాయమా? అన్యాయమా? ప్రజలే ఆలోచించాలన్నారు. నా ఇంటికి తలుపులు బద్దలు కొట్టి రావడం న్యాయమా? అని అడిగారు.తనకు ఉన్న ధైర్యం ఒకటేనని... నీతిగా, ధర్మంగా బతకాలన్నదే తన ఆలోచన అన్నారు. గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి, దాడి చేస్తే తనపై 50 కేసులు పెట్టుకోవచ్చని... అవసరమైతే అరెస్ట్ కూడా చేయవచ్చన్నారు. తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయేవాడినన్నారు. కానీ నా ఇంట్లోకి వచ్చి నా ఏకాగ్రతను చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డే తన ప్రశాంతతను చెడగొడుతున్నాడని ఆరోపించారు. నా బిడ్డతో ఏదో ఒకరోజు సఖ్యత కుదురుతుందని, కుటుంబ సభ్యులం కూర్చొని మాట్లాడుకుంటామన్నారు. కుటుంబ సభ్యుల గొడవలకు మధ్యవర్తులు అవసరం లేదని స్పష్టం చేశారు. తాను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని... కానీ అన్నీ మరిచిపోయి తాను కొట్టిన విషయమే మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను కొట్టింది వాస్తవమేనని... అసత్యమేమీ కాదన్నారు.