ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రైతు బీమా' కోసం బతికుండగానే భర్తలను చంపేశారు.. ఈ మహిళలవి నిజంగా 'చావు' తెలివితేటలే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2024, 06:27 PM

పతియే ప్రత్యక్ష దైవంగా భావించి గతంలో భార్యలు పూజించేవారు. తమ భర్తల యోగక్షేమాల కోసం వత్రాలు, పూజలు చేసేవారు. భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని నోములు నోచేవారు. ఎప్పుడూ ఒకరితో ఒకరు కలిసి జీవించేవారు. సుఖమైనా, దుఃఖమైనా ఒకరితో ఒకరు పంచుకుంటూ కలిసుండేవారు. మూడుముళ్లతో ఏర్పడిన భార్యాభర్త బంధం చివరి క్షణం వరకూ సాగేది. కలలో కూడా భర్తలకు హానీ కలిగించే ఆలోచన వచ్చేది కాదు. ప్రస్తుతం కాలం మారింది. కొందరు భార్యలు బతికుండానే భర్తలను చంపేస్తున్నారు. అటువంటి ఘటన మెదక్‌ జిల్లా రూరల్‌ మండలం గుట్టకిందిపెల్లెలో చోటు చేసుకుంది.


ప్రభుత్వం అందించే రైతుబీమా సొమ్ము రూ.5 లక్షలు పొందేందుకు ఇద్దరు మహిళలు తమ భర్తలను బతికుండానే చంపేశారు. తమ భర్తలు చనిపోయినట్లుగా ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి లబ్ధి పొందారు. రైతుభరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఆ ఇద్దరు మహిళలు స్వాహా చేశారు. మూడేళ్ల క్రితం ఒకరు, ఏడాది క్రితం మరొకరు రైతుబీమా సొమ్ముకోసం చావు తెలివితేటలు ప్రదర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేతో వీరి వ్యవహారం బట్టబయలైంది. సర్వేలో భాగంగా కుటుంబసభ్యుల వివరాల నమోదు కోసం అధికారులు వెళ్లినప్పుడు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరు మహిళలు రైతుబీమా కింద లబ్ధి పొందినట్లుగా చెప్పారు. అయితే వారి భర్తలు బతికి ఉండగానే రైతుబీమా సొమ్ము తీసుకున్నట్లు తెలిసింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ల శ్రీనివాస్‌, ఎలిగేటి మల్లేశం బతికుండగానే చనిపోయినట్లుగా వారి భార్యలు నకిలీపత్రాలు సృష్టించారు. శ్రీనివాస్‌ 2021 మే 22న చనిపోయినట్లు అతడి భార్య జ్యోతి అప్పటి పంచాయతీ సెక్రటరీ ప్రభాకర్‌ నుంచి డెత్‌ సర్టిపికెట్‌ తీసుకొన్నారు. అనంతరం ఆ సర్టిఫికేట్‌తో రైతుబీమా డబ్బులు తీసుకున్నారు. 2023 పిబ్రవరి 7న మల్లేశం చనిపోయినట్లు అతడి భార్య శేఖవ్వ పంచాయతీ సెక్రటరీ నరేందర్‌ ద్వారా డెత్‌ సర్టిపికెట్‌ పొందింది. అదే ఏడాది ఆమె కూడా రూ. 5 లక్షల రైతుబీమా సొమ్ములు తీసుకుంది. జనరల్‌ ఇన్సురెన్స్‌ కింద దరఖాస్తు చేసుకొని మరో రూ.2లక్షల చొప్పున సొమ్మునూ ఆ మహిళలు క్లెయిమ్‌ చేసుకున్నట్లు తెలిసింది.


కుల గణన సర్వేలో విషయం వెలుగులోకి రాగా.. పోలీసులు విచారణ చేపట్టి వారు బతికే ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో రాజ్‌పల్లి క్లస్టర్‌ పరిధిలో పని చేసే ఏఈవో భార్గవి వారి క్లెయిమ్‌లపై విచారణ చేశారని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాతే రైతుబీమాకు ఆమె సిఫారసు చేసినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు నిందితులు పిట్ల జ్యోతి, శేఖవ్వలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ భార్యలవి చావు తెలివితేటలంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa