సర్పంచ్‌లు (మాజీ), స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను గమనిస్తున్నామని, అందుకే నిధులను విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ... సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల (మాజీ) పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు.అయితే ఈ నిధుల విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు దాదాపు రూ.1,300 కోట్ల వరకు ఉన్నాయన్నారు. ఇందులో రూ.10 లక్షల లోపు బకాయిల విలువ దాదాపు రూ.400 కోట్లుగా ఉందన్నారు. తొలుత ఈ బిల్లులను విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం వారి బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు.