ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంచిర్యాల జిల్లాలో మామిడి రైతుల కష్టాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2025, 02:29 PM

మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గల వ్యవసాయ మామిడి రైతులు కోనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోనీ బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల్లో మామిడి రైతులను ఆదుకోవాలని దళారుల నుండి మోసపోకుండా చూడాలని  మామిడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను పూర్తిస్థాయిలో  అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం,  పట్టింపులేని విధానాలతో బెల్లంపల్లి పట్టణంలో మామిడి కొనుగోలు కేంద్రం ఏర్పాటులో జాప్యం  జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. మూడేళ్ల క్రితం స్థలం కేటాయించి రెండు షెడ్లు నిర్మించినప్పటికీ మామిడి పండ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకాక షెడ్లు  నిరుపయోగంగామారాయి.  బెల్లంపల్లి  నియోజక వర్గంలోని బెల్లంపల్లి, నెన్నెల, తాండూర్‌, భీమిని, చెన్నూర్‌ నియోజకవర్గంలోని చెన్నూర్‌, మామిడిగట్టు, కోటపల్లి, భీమారం, మంచిర్యాల నియోజక వర్గంలోని లక్షట్టిపేట హాజీపూర్‌ ,మండలాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి.
హమీ ఇచ్చారు మరిచిపోయారు
మంచిర్యాల జిల్లాలో మామిడి పండ్ల కొనుగోలు కేంద్రం అందుబాటులో లేకపోవడంతో ఏటా జిల్లా రైతులు పక్కనే ఉన్న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, చంద్రపూర్‌లల విక్రయిస్తున్నారు. ఈ తరుణంలో కొందరు మామిడి  రైతులు దళారుల బారిన పడి మోసపోతున్నారు. బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్‌లో 2015లో  అప్పటి రాష్ట్ర మార్కెటింగ్‌, శాఖ మంత్రి  మామిడి మార్కెట్‌ యార్డును మంజూరు చేశారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డు పక్కనే గల ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించగా ప్రభుత్వం రూ. 1.26 కోట్లను మంజూరు చేసింది.  దాదాపు 10వేల టన్నుల సామర్థ్యం గల రెండు కవర్‌ షెడ్లను మూడేళ్ల క్రితం నిర్మించారు. షెడ్లు నిర్మించినప్పటికీ అంతర్గత రోడ్లు నిర్మించలేదు. ఈ యార్డుకు అను బంధంగా  కోల్డ్‌స్టోరేజీ ప్లాంటును ప్రభుత్వం మంజూరు చేయలేదు. రెండేళ్ళ క్రితమే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని ప్రకటించినప్పటికీ నేటికి దీని ఊసే లేకపోవడంతో జిల్లాకు చెందిన మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పుడిప్పుడే మామిడి పూతతో పాటు పిందెలు వస్తున్నాయి. ఏప్రిల్‌లోగా పంట చేతికందే అవకాశాలు ఉన్నాయి.  జిల్లా అధికార యంత్రాంగం చొరవచూపి బెల్లంపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుతున్నారు.  
జిల్లా వ్యాప్తంగా 18,108 ఎకరాల్లో మామిడి తోటల సాగు... 
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మొత్తం 18,108 ఎకరాల్లో మా మిడి తోటలను సాగుచేస్తున్నారు. ఏటా 37,170 టన్నుల దిగుబడి అంచనా వేశారు. బెల్లంపల్లిలో 1,664 ఎకరాల్లో, కాసిపేటలో 51, తాండూర్‌లో 1,887 ఎకరాల్లో కలిపి బెల్లంపల్లి డివిజన్‌లో 3,602 ఎకరాల్లో  సాగు చేస్తున్నారు. భీమిని 144 ఎకరాల్లో, కన్నెపల్లి 182, నెన్నెల 5,832, వేమనపల్లి 70, భీమారంలో 2,322, చెన్నూర్‌లో 1,167, జైపూర్‌లో 1,908, కోటపల్లిలో 769, మందమర్రి 1,102 ఎకరాల్లో తోటలను సాగు చేస్తున్నారు. దండెపల్లిలో 384 ఎకరాల్లో, హాజీపూర్‌లో 159, జన్నారంలో 421, లక్షెట్టిపేటలో 41, మంచిర్యాలలో 2, నస్పూర్‌లో 3ఎకరాల్లో  సాగు చేస్తున్నారు.  
నిరుపయోగంగా మార్కెట్‌ షెడ్లు..
కోట్ల రూపాయలు ఖర్చు చేసి మామిడి పండ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కవర్‌ షెడ్లు నిర్మించినా అవి నిరుపయోగంగా మారాయని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో మామిడి పండ్లను అమ్ముతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. నాగపూర్‌లో సరైన గిట్టుబాటు ధర లభించక మద్యదళారుల ప్రమేయంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైన ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి  మామిడి మార్కెట్‌ యార్డులో కోల్డ్‌ స్టోరేజ్‌ ప్లాంటు ఏర్పాటుకు నిధులు మంజూరయ్యేలా, అంతర్గత రోడ్లు నిర్మించేలా కృషి చేసీ క్రయవిక్రయాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యను గతంలో  రైతులు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే  గడ్డం వినోద్ వెంకటస్వామి దృష్టికి తిసుకపోగ ఆయన స్పందిస్తూ కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ కి సంబంధించిన అయ్యే ఖర్చు అంచనా వేయం తయారు చేయాలని  మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు సూచించిన ఇప్పటి వరకు ముందడుగు పడలేదు... ఇప్పటికైన స్థానిక ఎమ్మెల్యే వినోద్ స్పందించి ఈ సంవత్సరం తాత్కాలిక కోనుగోలు చేపట్టాలని వచ్చే సంవత్సరం వరకు పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు...
పెద్దఎత్తున నష్టపోతున్న రైతులు 
మంచిర్యాల జిల్లాలోనే పండించే మామిడి పంటను జిల్లాలోనే కొనే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలి. పక్క రాష్ట్రంలో అమ్మకానికి వెళ్తే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సరైన గిట్టుబాటు రాక.. రవాణా ఖర్చులు, డ్యామేజ్ తోపాటు, పంటను లారీల నుండి దొంగలు దొంగిలించడంతో పెద్ద ఎత్తున రైతులకు నష్టం వస్తుంది ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతుల కష్టాలు తీర్చేందుకు తప్పనిసరిగా మామిడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa