మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్ ప్రాంతం మొత్తం వాయు కాలుష్యంతో నిండిపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపుగా మూడు నెలల నుంచి ఇద్దరు బిల్డర్లు చేసే పనులతో ఎయిర్ క్వాలిటీ ఏకంగా 342కి పెరిగింది. దీనిబట్టి ఇక్కడ కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. బిల్డర్లు ఇచ్చే లంచాలకు అలవాటు పడిన అధికారులు ఇక్కడ వాయు కాలుష్యం హెచ్చుమీరుతున్నా.. చూసీ చూడనట్లు వదిలేయడంతో ఇబ్బందులు తప్పడం లేదు. దీనికితోడు నిర్మాణాలు చేస్తున్న బిల్డర్లు.. కనీస నిబంధనలు పాటించడం లేదు. ఇక్కడ చుట్టూరా వాయు కాలుష్యం పెరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను వదిలేశారు. ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణం చేస్తున్న అపార్టుమెంట్లతో మియాపూర్ మొత్తం దుమ్ము ధూళితో కలుషితం అయిపోయింది. ఫలితంగా మియాపూర్ పరిధిలో వాయు కాలుష్యం పెరుగడంతో.. సుమారు పదుల సంఖ్యలో అపార్ట్మెంట్లలో శ్వాసకోస వ్యాధులు పెరిగిపోయాయి.
ఎయిర్ క్వాలిటీ ఎక్కడ?
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో గాలి నాణ్యత 0 నుంచి 50 లోపు నమోదు అయితే ఆ గాలి చాలా స్వచ్ఛంగా ఉందని అర్థం. అదే ఏక్యూఐ 51 నుంచి 100 వరకు ఉన్నట్లయితే గాలి నాణ్యత కొంత ప్రమాదకరంగానే మారుతుందని, ఇక 100 దాటితే అది ప్రమాదకరమని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్పష్టం చేస్తున్నది. కానీ, హైదరాబాద్ లో ని మియాపూర్ లో ఎయిర్ క్వాలిటీ 342 గా నమోదు అయ్యింది. మియాపూర్ నరేన్ గార్డెన్స్ వీధిలో ఇద్దరు బిల్డర్లు చేస్తున్న విధ్వంసంతో ఇక్కడ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
మియాపూర్ క్రాస్ సమీపంలో సియా బిల్డర్స్, ప్రైమార్క్ బిల్డర్స్ అనే రెండు సంస్థలు భారీ నిర్మాణాలు చేపట్టాయి. నిత్యం రద్దీగా ఉంటే ప్రాంతమే కాకుండా.. ఇక్కడ వేల సంఖ్యలో ఫ్లాట్లతో అపార్ట్మెంట్లు ఉన్నాయి. కానీ, ఈ రెండు సంస్థల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇక్కడ జనం ఉండలేక పోతున్నారు. సియా బిల్డర్స్, ప్రైమార్క్సంస్థలు ఇక్కడ నిర్మాణ సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడంలేదు. అపార్ట్మెంట్ నిర్మాణాలు చేసే సమయంలో సమీప అపార్టుమెంట్ల మీద దుమ్మూ, ధూళి పడకుండా చర్యలు తీసుకోవాలని నిబంధనలు చెప్పుతున్నాయి. అంతేకాకుండా ఆ రూట్లో కాలుష్యం కలుషితం కాకుండా చుట్టూరా పరదాలు, సేఫ్టీ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ, బిల్డర్ల కక్కుర్తి కారణంగా కనీసం రక్షణ చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ చుట్టూరా ఉండే అపార్ట్మెంట్లలోని జనం తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. పెద్దలు, చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ దుమ్ము తీవ్రత ఎంతగా ఉందంటే.. పక్కన ఉన్న ఒక అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ లో వాయు కాలుష్యం 342గా నమోదైంది. అంటే.. ఇక్కడ కాలుష్యం ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
అనుమతుల సమయంలో ఏం చెప్పారు
కొత్త నిర్మాణాలు చేసే సమయంలో అక్కడి పరిస్థితులను అంచనా వేసి అధికారులు నిర్మాణ అనుమతులు ఇస్తారు. అయితే, ఇలాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇక్కడ పరీక్షలు చేసి నిర్మాణాలపై ఆంక్షలు విధించాలి. కానీ, ఈ రెండు నిర్మాణ సంస్థలు సంబంధిత అధికారులను మేనేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. నెలల తరబడి ఇదే తీరున ఇస్టానుసారంగా నిర్మాణాలు చేయడం, ఎలాంటి చర్యలు తీసుకోకుండా కన్స్ట్రక్షన్ చేస్తుండటంతో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. దీంతో మియాపూర్ మొత్తం దుమ్ము ధూళితో కలుషితం అయిపోతుంది. పీసీబీ అధికారులు, చందానగర్ మునిసిపల్ అధికారులు నిద్ర పోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలున్నాయి. పూర్తి రక్షణ చర్యలు కాలుష్యం పెరుగకుండా తీసుకోవాల్సిన నిబంధనలతో చేయాల్సిన నిర్మాణాలను కొన్ని కంపెనీలు వదిలేశాయి. మొదటి నుంచీ ఈ సంస్థలు కనీస ప్రమాణాల్ని పాటించడం లేదు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో బాంబుల మోత మోగించారు. స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు.
వద్దు.. అటువైపు వెళ్లకండి..!
నిజానికి, ఈ పరిస్థితులపై మియాపూర్ కు చెందిన జనం నుంచి జీహెచ్ఎంసీ, పీసీబీ అధికారులకు మొదట్నుంచీ ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి. కానీ, వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకాడుతున్నారు. ఓ ఉన్నతాధికారి నుంచి.. అటు వైపు వెళ్లకండి అంటూ ఆదేశాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఇక్కడ బాంబుల మోత, నిర్మాణాలు ఇంకా కొనసాగుతుండటంతో.. మియాపూర్ ప్రాంతమంతా త్వరలో ప్రమాదానికి గురయ్యే పరిస్థితులున్నాయి. అయితే, కనీసం తమ ఇండ్లలోకి భయంకరమైన దుమ్ము, ధూళి రాకుండా సైఫ్ లైవ్లీ హుడ్ ఉండేలా చూడాలని, ఇప్పటికే చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యారంటూ నెత్తీనోరూ బాదుకుంటున్నారు.డస్ట్ ప్రూఫ్ షీట్స్ పెట్టాలని కోరారు. కానీ, ఇవన్నీ గాలికి వదిలేశారు.
ఎయిర్ క్వాలిటీ 342 ఎలా నమోదు?
మియాపూర్ లో ఎయిర్ క్వాలిటీ 342గా నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఖ్య ఎలా నమోదు అయ్యిందనే అంశంపై పీసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు ఈ సంఖ్య ఎలా వచ్చింది? దీనిని ఎవరు నమోదు చేశారనే అంశాన్ని తెలుసుకుంటున్నారు. ఎందుకంటే 342 అనే సంఖ్య ఎక్కువగా ఢిల్లీ, నోయిడా వంటి ప్రాంతాల్లో నమోదు అవుతుంది. అలాంటిది ఇక్కడ ఎలా నమోదు అయ్యింది? ఈ సంఖ్యను ఎవరు రికార్డ్ చేశారో కనుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa