ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేయడం పరిపాటిగా మారిపోయిందని అనుకుని గమ్మున ఉండడంలేదు నగర ప్రజలు ఇప్పుడు. ఒకదాని తర్వాత ఒకటిగా పరిష్కారమౌతున్న తీరును చూసి హైడ్రాను ఆశ్రయిస్తున్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తే దశాబ్దాల సమస్యకు పరిష్కారం ఇట్టే దొరుకుతోందని గ్రహించిన నగరవాసులు పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల కబ్జాపై ఫిర్యాదులు చేస్తున్నారు. హైడ్రా ప్రజావాణికి సోమవారం వచ్చిన 59 ఫిర్యాదుల్లో 70 శాతం సామాజిక ఫిర్యాదులే ఉన్నాయి. టోలిచౌకి హకీంపేటలో బాబా హోటల్ వద్ద రోడ్దును ఆక్రమించి షాపు పెట్టేశారంటూ నివాసితులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సుభాష్‌నగర్‌లో కొంపల్లికి వెళ్లే 50 అడుగుల రహదారి 100 అడుగుల మేర 10 ఫీట్లకే పరిమితమైందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఎదెరెదురుగా ఉన్న వారి ప్లాట్లవల్ల ఇరువైపులా 20 అడుగుల చొప్పున కబ్జా చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో సర్వేనంబరు 155లో ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించిన 3500ల గజాల స్థలాన్ని కబ్జా చేస్తున్నారని భగత్‌సింగ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ ప్రజావాణికి ఫిర్యాదు చేసింది. గతంలో మున్సిపాలిటీ అధికారులు కూల్చేసినా దానిని మళ్లీ కబ్జా చేస్తున్నారని పేర్కొంది. ఓయూ కాలనీలో తమ ప్లాట్ ను నలువైపుల మూసివేయడంతోపాటు రహదారి పక్కనే ఉన్న శ్మశానాన్ని కూడా విక్రయించారని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామంలో సర్వే నంబరు 33\10లో మొత్తం13 ఎకరాల భూమి ఉండగా.. అందులో 6 ఎకరాల్లో మాతా అరవింద్ కాలనీ ఉంది. మిగతా 7 ఎకరాలను సొంతం చేసుకున్న వ్యక్తి తమది దేవాదాయ శాఖ పరిధిలో ఉందంటూ అధికారులకు ఫిర్యాదు చేసి రిజిస్ట్రేషన్లు అవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ఎవరిది దేవాదాయ శాఖ పరిధిలో ఉందో తేల్చాలని.. హైడ్రాను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa