తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా మహిళలు నారీ శక్తికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు. సాంకేతికతను అందిపుచ్చుకొని, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న వారి కృషిని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రశంసించారు. ఆదివారం (మే 25, 2025) నిర్వహించిన తన మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. గ్రామీణ భారతదేశంలో మహిళా సాధికారతకు సంగారెడ్డి మహిళలు నిదర్శనమని ప్రధాని కొనియాడారు.
ఒకప్పుడు వ్యవసాయ పనులకు ఇతరులపై ఆధారపడిన మహిళలు, ఇప్పుడు స్వయంగా డ్రోన్ల ద్వారా సాగు చేస్తూ ‘స్కై వారియర్స్’గా మారారని ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 50 ఎకరాలకు పైగా సాగు చేస్తున్న పంట పొలాల్లో పురుగు మందులను పిచికారీ చేయడానికి ఈ మహిళలు డ్రోన్లను ఉపయోగిస్తున్నారని ప్రధాని వెల్లడించారు. ఇది వారి పనితీరులో గణనీయమైన మార్పును సూచిస్తుందని.. ఆధునిక వ్యవసాయ పద్ధతులు గ్రామీణ మహిళలకు ఎలా సాధికారత కల్పిస్తున్నాయో తెలియజేస్తుందని ప్రధాని అన్నారు.
డ్రోన్ల ద్వారా పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల మహిళలకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని ప్రధాని మోదీ హైలైట్ చేశారు. వారు తీవ్రమైన ఎండ వేడిమికి, విషపూరిత రసాయనాల బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గిపోయింది. సంప్రదాయ పద్ధతుల్లో పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఇది నివారిస్తుంది. డ్రోన్ల వినియోగంతో పని వేగం, సమర్థత పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పురుగు మందులు పిచికారీ చేయగలుగుతున్నారు. ఇది శారీరక శ్రమను కూడా తగ్గిస్తుంది. సమర్థవంతమైన సాగు పద్ధతులతో దిగుబడులు పెరిగి, ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ మహిళలకు అవకాశం లభిస్తుంది.
ప్రధాని మోదీ చేసిన ఈ ప్రశంసలను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ‘తెలంగాణ మహిళలను చూసి గర్విస్తున్నాను, అని ఆయన తెలిపారు. ‘ఈ మార్పు.. నూతన సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా నారీ శక్తిని శక్తివంతం చేయడంలో ప్రధాని మోదీ ప్రభుత్వం చూపిస్తున్న అంకితభావానికి నిదర్శనంగా నిలిచిందని’ ఆయన ఒక వీడియోను కూడా షేర్ చేశారు.
సంగారెడ్డి మహిళల ఈ విజయం కేవలం సాంకేతిక ఆవిష్కరణను అందిపుచ్చుకోవడం మాత్రమే కాదు, సామాజిక మార్పుకు కూడా ప్రతీక. వ్యవసాయ రంగంలో మహిళలు కేవలం శ్రమకు మాత్రమే పరిమితం కాకుండా.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్వయం సమృద్ధిని సాధించవచ్చని ఇది నిరూపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ‘నారీ శక్తి’ని ప్రోత్సహించడానికి.. వారికి నూతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడానికి కట్టుబడి ఉందని ఈ సంఘటన తెలియజేస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఇతర గ్రామీణ మహిళలకు కూడా స్ఫూర్తినిస్తుంది. ప్రభుత్వ పథకాలు, సాంకేతికతను సద్వినియోగం చేసుకొని తమ జీవితాలను, తమ కుటుంబాల భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఇది ఒక ఉదాహరణ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa