పటాన్చెరు : విద్యార్థి జీవితంలో లక్ష్యం అనేది అత్యంత కీలకమని.. ఇష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదని..చదువు అనే ఆయుధం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాలులో.. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి వార్షిక ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కుమార్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరై.. పురస్కారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో.. జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపిన వెంటనే సంతోషం వ్యక్తం చేసి.. కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందని తెలిపారు. తాను విద్యార్థి దశలోనే కలెక్టర్ కావాలన్న లక్ష్యం ఏర్పరచుకొని.. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుని.. లక్ష్యాన్ని సాధించానని విద్యార్థులకు వివరించారు.
లక్ష్య సాధనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడంతోపాటు.. నిరాశ నిస్పృహాలు సైతం ఎదురయ్యాయని తెలిపారు. ప్రతి విద్యార్థి జీవితంలో లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని.. అప్పుడే ఉన్నత శిఖరాలు అధిరోహించడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి సబ్జెక్టును ఇష్టపడి చదువుతూ.. బలమైన పునాది ఏర్పరచుకోవాలని కోరారు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ అనేది అత్యంత కీలకమని.. దీని ఫలితాల ఆధారంగానే మనం ఏం సాధించాలనుకున్నామో స్పష్టత లభిస్తుందన్నారు. విద్యార్థి లక్ష్యసాధనలో ఉపాధ్యాయులు మెంటర్ పాత్ర పోషించాలని.. తల్లిదండ్రులు ప్రతి అడుగులో తోడుగా నిలవాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి.. విద్యార్థుల సంక్షేమానికి స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్న సేవలను ఆమె ప్రశంసించారు. ప్రధానంగా పదవ తరగతి పరీక్షల సమయంలో విద్యార్థులలో మానసిక ధైర్యం పెంపొందించేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే మోటివేషనల్ తరగతులతో పాటు, పరీక్ష సామాగ్రి అందించడంతోపాటు ఫలితాలు వెలువడిన అనంతరం నగదు పురస్కారాలు పంపిణీ చేయడం ప్రశంసనీయమన్నారు.
ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఇటీవల 30 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు సమాజంలోని అన్ని అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. బీహార్ రాష్ట్రంలోని.నిరుపేద కుటుంబం నుండి వచ్చిన తాను ఐపీఎస్ సాధించాలన్న లక్ష్యంతో విద్యార్థి దశ నుండే ప్రణాళికాబద్ధంగా చదువుతూ లక్ష్యాన్ని సాధించానని తెలిపారు. కల కలగా మిగిలిపోకూడదని.. దాని సాధనకు నిరంతర కృషి అవసరమని తెలిపారు. పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మినీ ఇండియా గా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో అత్యధిక శాతం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న లక్ష్యంతో.. గత దశాబ్ద కాలంగా ప్రతి ఏటా పదవ తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే మోటివేషనల్ తరగతులు నిర్వహించడంతోపాటు పరీక్షల సమయంలో పరీక్ష సామాగ్రిని అందిస్తూ వారికి తోడుగా నిలుస్తున్నామని తెలిపారు. పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన. విద్యార్థినీ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలకు చెందిన 450 మంది విద్యార్థులకు మొదటి బహుమతి 3 వేల రూపాయలు, ద్వితీయ బహుమతి రెండు వేల రూపాయలు, తృతీయ బహుమతి ఒక వెయ్యి రూపాయల చొప్పున తొమ్మిది లక్షల రూపాయల నగదు పురస్కారాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులోనూ. విద్యార్థులకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.నిరుపేద కుటుంబాల నుండి వచ్చిన వ్యక్తులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి నేడు కలెక్టర్లుగా, ఐపీఎస్ అధికారులుగా ఉద్యోగాలు సంపాదించి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని తెలిపారు. నేటి తరం యువత పెడదారి పట్టకుండా జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలని అభిలాషించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు నగదు పురస్కారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీనివాస్.. వివిధ అంశాలపై విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa