ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు..కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 04:25 PM

తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన కేసీఆర్ ఫ్యామిలీలో ఇటీవల చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. 'మై డియర్ డాడీ' అంటూ తన తండ్రికి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత. ఆ తర్వాత సొంత పార్టీపై, కొందరు నేతలపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్  శ్రేణులకు షాక్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారా? దయ్యాలే దోస్తులయ్యారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఆమె స్పందించిన తీరు ఇప్పుడు సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్లు ఆమె చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 'బీఆర్ఎస్‌లో నాకు కేసీఆర్ ఒక్కరే నాయకుడు.. ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించను' అని తేల్చి చెప్పిన కవిత.. ఇప్పుడు కేటీఆర్‌ మా వర్కింగ్ ప్రెసిడెంట్.. అంటూ ట్వీట్ చేయడం వెనుక అసలు మతలబు ఏంటనే చర్చ షురూ అయింది. ఇంతకు మీరు బీఆర్ఎస్‌తోనే ఉన్నారా?.. కేటీఆర్ విషయంలో చేసిన ట్వీట్‌పై కవితను నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప ఎవరి నాయకత్వాన్ని అంగీకరించనని చెప్పిన మీరు ఇప్పుడు కేటీఆర్‌ను మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని సంబోధించడం ఏంటి? దయ్యాలు అప్పుడే దోస్తులు అయిపోయారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకు మీరు బీఆర్ఎస్‌తోనే ఉన్నారా? లేదా స్పష్టం చేయాలని, బీఆర్ఎస్, జాగృతితో రెండు దారుల ప్రయాణంపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని దాన్నిపై స్పష్టత ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. మొన్నటి మీ కోపానికి ప్రస్తుతం మీ తీరుకు సమాధానం చెబితేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ 'అక్క యూటర్న్ తీసుకున్నారని, ఫామ్‌హౌస్‌లో తండ్రితో డీల్ కుదిరినట్లుంది' అంటూ చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారాయి. యూ టర్నా లేక వ్యూహాత్మకమా?.. గత కొంతకాలంగా బీఆర్ఎస్‌లో కవిత వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. సొంతపార్టీ నేతలపై మాటల దాడికి దిగడం, ఆ వెంటనే తెలంగాణ జాగృతికి కొత్త కార్యాలయం ప్రారంభించడం ఆసక్తిగా మారింది. ఆ తర్వాత ఇందిరా పార్క్‌లో బీఆర్ఎస్ జెండాలు లేకుండా కేవలం జాగృతి పేరుతోనే ధర్నా కార్యక్రమం నిర్వహించడం, ఆర్టీసీ బస్‌పాస్ ధరల పెంపుపై బీఆర్ఎస్వీ, జాగృతి వేర్వేరుగా ఆందోళనలు చేపట్టడం రాజకీయ వర్గాల్లో కవిత అంశం మరింత చర్చకు దారి తీసింది. దీంతో ఆమె సొంత పార్టీ పెట్టడం దాదాపు ఖాయం అనే టాక్ వినిపించిన తరుణంలో అనూహ్యంగా కవిత ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లడం అందరిని విస్మయానికి గురి చేసింది. అయితే ఆమె తీరుపై కేసీఆర్ అప్పటికే ఆగ్రహంతో ఉన్నారని అందువల్ల తనను కలిసేందుకు వచ్చిన కవితను పట్టించుకోలేదనే ప్రచారం జరిగింది. కేడర్ సహకారం లేనందుకేనా?.. బీఆర్ఎస్‌ను విభేదించి సొంత అడుగులు వేయాలని భావించినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో కవిత యూటర్న్ తీసుకున్నారా అనే వాదన కూడా తెరపైకి వస్తోంది. బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేసిన కవితను పార్టీ నేతలు దూరం పెట్టారని, ఆమె చేపట్టిన కార్యక్రమాలకు చాలామంది జాగృతి నేతలు, కవిత ముఖ్య అనుచరులు సైతం హాజరుకావడం లేదనే చర్చ జరిగింది. దీంతో సొంత ఎజెండాతో వెళ్తే ఒంటరిగా మిగిలిపోతాననే భావించిన కవిత కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు అయ్యేందుకు కేసీఆర్ బయలుదేరుతున్న తరుణంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లడం చూస్తే కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారా అనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఓ వైపు బీఆర్ఎస్ తన పార్టీ అంటూనే మరోవైపు జాగృతి పేరుతో సొంత కార్యాచరణతో ముందుకు వెళ్లడం వెనుక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనేది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్వీని కాదని జాగృతిలో చేరికలు.. బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కవిత విషయంలో విమర్శలు వ్యక్తం అవుతున్నా కవిత మాత్రం జాగృతి బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. తాజాగా ఇవాళ ఖమ్మం జిల్లాలో పలువురు విద్యార్థులను తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్‌లోకి కండువాలు కప్పి ఆహ్వానించారు. విద్యార్థుల సమస్యలపై టీజేఎస్ఎఫ్ మెరుపు వేగంతో స్పందించాలని, ఆందోళనలు చేస్తే ప్రభుత్వం రెండు రకాలుగా స్పందించాలని పిలుపునిచ్చారు. అయితే ఓ వైపు బీఆర్ఎస్‌లోనే కొనసాగుతూ బీఆర్ఎస్ స్టూడెంట్ వింగ్ బీఆర్ఎస్వీని కాదని జాగృతిని బలోపేతం చేస్తుండటంతో కవిత ఇంతకు ఎటువైపు అనేది చర్చనీయాంశం అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa