ప్రస్తుత సమాజంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. మనిషి అత్యాశ, అమాయకత్వమే పెట్టుబడిగా కొందరు కేటుగాళ్లు నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా.. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కుటుంబ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఓ ముఠా మోసానికి పాల్పడింది. ఇంటి వెనకాల బంగారం ఉందని..దాన్ని తీస్తే కష్టాలు తొలిగిపోతాయని నమ్మించి రూ.15 లక్షలతో ఊడించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరాములపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. శ్రీరాములపల్లికి చెందిన గజ్జి ప్రవీణ్ తండ్రి కనకయ్య ఆర్టీసీ వేములవాడ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. పదిహేను రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో ఎడమ కాలు విరిగింది. ప్రవీణ్ తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను గమనించిన ఓ వ్యక్తి స్వామి వేషంలో పది రోజుల క్రితం ప్రవీణ్‌ను కలిశాడు. ప్రవీణ్ ఇంట్లో పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుని, ఇంటి పక్కనే క్వింటాల్ బంగారం ఉందని, దానిని బయటకు తీసి పూజలు చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మబలికాడు. లేకపోతే తండ్రి నెల రోజులలోపు చనిపోతాడని భయపెట్టాడు. పూజల కోసం పూజా సామాగ్రి కొనుగోలు చేయాలని చెప్పి, విడతలవారీగా రూ. 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు... ఇలా మొత్తం రూ. 15 లక్షలు నగదును ప్రవీణ్ నుంచి ఫేక్ బాబా ముఠా వసూలు చేసింది.
డబ్బులు తీసుకున్న తర్వాత నిందితులు కొంత పూజా సామాగ్రి కొనుగోలు చేసి ఇంటి పక్కనే ఒక గొయ్యి తవ్వి, కుంకుమ, పసుపు చల్లి, అందులోంచి ఒక డబ్బాను బయటకు తీశారు. అది ప్రవీణ్‌కు ఇచ్చి, అందులో కిలో బంగారం ఉంటుందని నమ్మించారు. ఆ డబ్బాను ఇప్పుడే ఓపెన్ చేయకూడదని దేవుడి గదిలో పెట్టి పూజలు చేయాలని నమ్మించారు. అయితే, అక్కడితో ఆగకుండా, నిందితులు మరింత డబ్బు కావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. లేకపోతే మీ నాన్నను ఇక్కడే చంపి పాతిపెడతామని హెచ్చరించారు. వారి బెదిరింపులకు భయపడిన ప్రవీణ్ చుట్టుపక్కల వారి వద్ద నుంచి అప్పు చేసి మరీ కొంత డబ్బు వారికి ఇచ్చాడు. అయితే ఆ డబ్బాలో ఉంది బంగారం కాదని తెలుసుకున్న ప్రవీణ్ తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాధితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ మోసానికి పాల్పడిన ఈర్నాల రాజు, మిరియాల దుర్గయ్య, పెనుగొండ రాజు, చల్లా అజయ్, ఈర్నాల సతీష్‌ను అరెస్ట్ చేశారు. పూజలు చేస్తామంటూ వేషాలు వేసుకుని తిరిగే నకిలీ స్వాముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. మూఢనమ్మకాలను వీడనాడాలని, అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa