ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతికి వెళ్లాలంటే చర్లపల్లికి వెళ్లాల్సిందే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 08:41 PM

వేసవి సెలవుల కాలం వచ్చిందంటే.. భారతదేశంలో రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోతుంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు, ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారి సంఖ్య ఈ సీజన్‌లో గణనీయంగా పెరుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబాలతో కలిసి ప్రయాణించేవారు అధిక సంఖ్యలో రైళ్లపైనే ఆధారపడుతుంటారు.


ఈ భారీ డిమాండ్‌ను తీర్చడానికి.. భారతీయ రైల్వే, ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్), ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టి, ఇప్పటికే ఉన్న సేవల కాలపరిమితిని పొడిగించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం కూడా ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు వాటిలో కొన్ని రైళ్ల సర్వీసులను పొడిగించింది. ప్రయాణికుల రద్దీని.. వారి విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.


ప్రస్తుతం గతంలో చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రవేశపెట్టిన 26 ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ఈ సేవలు వాస్తవానికి ఈ నెల మొదటివారంలోనే ముగియాల్సి ఉండగా.. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా వీటిని జూన్ చివరి వారం వరకూ పొడిగించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ ప్రత్యేక రైళ్ల పొడిగింపు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో ఉపశమనం కల్పిస్తుంది.


ప్రత్యేక రైళ్ల వివరాలిలా..


నంబర్ 07017 (చర్లపల్లి-తిరుపతి):


ఈ ప్రత్యేక రైలు జూన్ 27వ తేదీ వరకు ప్రతి శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9:45 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:15 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.


నంబర్ 07018 (తిరుపతి-చర్లపల్లి):


ఈ ప్రత్యేక రైలు జూన్ 28వ తేదీ వరకు ప్రతి సోమ, శనివారాల్లో సాయంత్రం 4:40 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:10 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.


ఈ రైళ్లు తమ మార్గంలో మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తాయి.


దీంతో పాటు..


నంబర్ 07251 (చర్లపల్లి నుంచి తిరుపతి):


ఈ ప్రత్యేక రైలు ప్రతి బుధవారం సాయంత్రం 6:50 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 6:55 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.


సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభించిన మోదీ


నంబర్ 07252 (తిరుపతి నుంచి చర్లపల్లి):


ఈ ప్రత్యేక రైలు ప్రతి గురువారం సాయంత్రం 6:55 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ మార్గంలో రైలు జనగామ, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తుంది.


ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, తప్పనిసరిగా తమ రైలు వేళలను, ప్లాట్‌ఫామ్ నంబర్లను ధృవీకరించుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. దీనికోసం భారతీయ రైల్వేలు లేదా ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక వెబ్‌సైట్లను, మొబైల్ యాప్‌లను, లేదా 139 హెల్ప్‌లైన్‌ను ఉపయోగించుకోవచ్చు. ముందస్తు ప్రణాళిక, తాజా సమాచారం తెలుసుకోవడం ద్వారా ప్రయాణికులు అనవసరమైన ఆలస్యం, ఇబ్బందులను నివారించి.. సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa