ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ కోసం ఏకంగా సీఎంఓ నుంచి ఫోన్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 06:33 PM

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు సంస్థలకు దీటుగా నిలబడగలవని నిరూపిస్తూ.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ఒక అద్భుతమైన విజయగాథను లిఖిస్తోంది. ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచీ సిఫార్సులు వస్తున్నాయంటే.. దీని ప్రాభల్యం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. లక్షల్లో ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పించే ధోరణి సర్వసాధారణమైన ప్రస్తుత తరుణంలో.. ఈ ప్రభుత్వ పాఠశాలకు తల్లిదండ్రులు పోటీపడి మరీ తమ పిల్లలను పంపిస్తున్నారు. ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని పునరుద్ధరిస్తున్నారు.


ఇందిరానగర్ పాఠశాల..


పాఠశాలలకు సెలవులు ముగియగానే, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రైవేటు పాఠశాలల వైపే మొగ్గు చూపుతుంటారు. మధ్యతరగతి వర్గాలు సైతం ఇదే బాట పడుతుండటంతో, ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ తగ్గి, చాలాచోట్ల విద్యార్థుల సంఖ్య వందకు మించి ఉండటం లేదు. కానీ సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ఈ ధోరణికి పూర్తిగా విరుద్ధంగా నిలుస్తోంది. ఇక్కడ అడ్మిషన్ల కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక కౌన్సిలర్‌లు సైతం ప్రిన్సిపాల్‌తో మాట్లాడి.. తమ వారికి సీటు ఇప్పించాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటే ఈ పాఠశాలకు ఉన్న డిమాండ్ స్పష్టమవుతుంది.


దాదాపు పదేళ్ల క్రితం 300 మంది విద్యార్థులకు మాత్రమే పరిమితమైన ఈ పాఠశాలలో నేడు 1200 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తుండగా.. ఉన్న ఐదు తరగతులకు 23 సెక్షన్లున్నాయి. ఇది ఒక రకంగా కార్పొరేట్ పాఠశాలలకు మించిన డిమాండ్ ఉన్న విద్యాలయం అని చెప్పవచ్చు. ఇక్కడ అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్‌లు, విదేశీ భాషల బోధన, ఆన్‌లైన్ తరగతులు, ఐఐటీ ఫౌండేషన్ విద్య, విశాలమైన ఆట మైదానం, ఆధునిక సౌకర్యాలతో కూడిన 24 తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సబ్జెక్టుకు నిష్ణాతులైన నలుగురు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండటం ఇక్కడి విద్యా ప్రమాణాలకు నిదర్శనం.


ఈ పాఠశాలకు ఇంతటి గుర్తింపు రావడానికి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు కృషి ఎంతో ఉంది. ఆయన ప్రత్యేక చొరవతో పలు కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత నిధులను సేకరించి, ఇక్కడ ఆధునిక తరగతి గదులను, కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయించారు. డిజిటల్ క్లాస్ రూమ్‌లను సిద్ధం చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు నెలకు రెండుసార్లు ఈ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన సందర్భాలున్నాయి. విదేశీ భాషలు, ఐఐటీ ఫౌండేషన్ కోర్సులను పరిచయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. డిజిటల్ కంటెంట్ విద్యా విధానాన్ని విద్యార్థులకు పరిచయం చేయడానికి సొంత ఖర్చులు కూడా పెట్టుకున్నారు. తద్వారా పదో తరగతి ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత, అత్యున్నత ర్యాంకులు ఈ పాఠశాలకు రావడానికి దోహదపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ పథకానికి సైతం ఈ పాఠశాల ఎంపికైంది.


ఈ పాఠశాల ప్రవేశ ప్రక్రియలో కూడా వినూత్న పద్ధతులను అవలంబిస్తోంది. సాధారణంగా ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ, గురుకులాల్లో సీట్ల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ఉంటుంది. కానీ ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల గత ఏడాది నుంచే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. పాఠశాలకు సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్‌ను రూపొందించారు. ఈ కోడ్‌ను స్కాన్ చేయగానే దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ అవుతుంది. ఇందులో విద్యార్థుల వివరాలను నమోదు చేసి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయవచ్చు.. లేదంటే.. దరఖాస్తు పత్రాలను పాఠశాలలో సమర్పించవచ్చు.


ప్రతి ఏటా ఆరవ తరగతి కోసం కొత్త దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ విద్యా సంవత్సరానికి 180 సీట్లు ఆరవ తరగతిలో ఖాళీగా ఉండగా.. ఇప్పటికే 600 పైగా దరఖాస్తులు అందాయి. మరో 200 పైగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అన్ని దరఖాస్తులను పరిశీలించి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అయితే.. ప్రవేశ పరీక్షకు ముందు, అనాథలు, సింగిల్ పేరెంట్ పిల్లలు, అత్యంత నిరుపేద విద్యార్థుల వివరాలను సేకరిస్తారు. మానవతా కోణంలో ఈ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారు. తదనంతరం.. సీట్లు మిగిలితే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను తీసుకుంటారు. ఎలాంటి పైరవీలకు తావులేకుండా.. అత్యంత పారదర్శకంగా సీట్లు కేటాయిస్తున్నామని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. ఈ పాఠశాల విజయం ప్రభుత్వ విద్యకు ఒక దిక్సూచిగా నిలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa