ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఉన్నతాధికారుల వ్యక్తిగత సమాచారాన్ని.. ముఖ్యంగా వారి సోషల్ మీడియా అకౌంట్లే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అధికారిక ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇలాంటి పలు ఘటనలు వెలుగులోకి రాగా.. అధికారులు, సామాన్య ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తీవ్రంగా సూచిస్తున్నారు.
ఉన్నతాధికారుల వివరాలతో నకిలీ ఖాతాలు..
సైబర్ మోసగాళ్లు ఉన్నతాధికారుల గౌరవనీయమైన స్థానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వారి నిజమైన ఫేస్‌బుక్ ఖాతాల నుంచి వ్యక్తిగత చిత్రాలు, చిరునామాలు, ఇతర వివరాలను సేకరించి.. వాటితో నకిలీ ప్రొఫైల్‌లను సృష్టిస్తున్నారు. ఈ ఫేక్ అకౌంట్లను ఉపయోగించి.. ఆ అధికారుల స్నేహితులు, బంధువులు, ఇతర పరిచయస్తులకు అత్యవసర నిధుల కోసం అభ్యర్థనలు పంపుతున్నారు. ‘అత్యవసర చికిత్స’, ‘ఆర్థిక ఇబ్బందులు’ వంటి అబద్ధాలు చెప్పి డబ్బులు పంపమని కోరుతున్నారు. నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాటి విషయంలోనూ ఇదే ధోరణి కనిపించింది. ఆమె ఖాతా హ్యాక్ అయిన విషయం కలెక్టరేట్ అధికారుల దృష్టికి వెళ్ళగా.. ఆ ఐడీతో తమకు ఎలాంటి సంబంధం లేదని వారు వెంటనే స్పష్టం చేశారు. నకిలీ ఖాతాను గుర్తించి వెంటనే నివేదించారు.
గతంలో కూడా నల్గొండ జిల్లాలో పనిచేసిన ఒక మహిళా కలెక్టర్ ఫేస్‌బుక్ ఐడీ ఇలాగే హ్యాక్ చేయబడిందని అధికారులు గుర్తుచేస్తున్నారు. ఇది సైబర్ నేరగాళ్లు ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ఎంత సాధారణంగా మారిందో తెలియజేస్తుంది. ఈ మోసగాళ్లు కేవలం డబ్బులు దొంగిలించడమే కాకుండా.. సదరు అధికారి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ప్రజలు, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే వారు.. ఇలాంటి అభ్యర్థనలు వచ్చినప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పోలీసులు పదేపదే సూచిస్తున్నారు.
అరగంటలో రూ.6.5 కోట్లు ఆవిరి.. డేటింగ్ యాప్‌లో పరిచయం.. అతడిని నిండా ముంచింది..
సైబర్ భద్రతకు పోలీసుల సూచనలు..
సైబర్ మోసగాళ్ల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అధికారులు, సామాన్య ప్రజలు కొన్ని ప్రాథమిక సూచనలను పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అభ్యర్థనలను ధృవీకరించండి.. మీకు తెలిసిన వ్యక్తి నుంచి, అది అధికారి అయినా, బంధువు అయినా, డబ్బులు పంపమని అభ్యర్థన వస్తే, వెంటనే వారికి ఫోన్ చేసి నిజంగా వారే అడుగుతున్నారో లేదో నిర్ధారించుకోండి. కేవలం సోషల్ మీడియాలో ఖాతాల ద్వారా పంపే మెసేజ్‌లను నమ్మవద్దు. అంతే కాకుండా.. మీకు తెలియని ప్రొఫైల్‌ల నుంచి వచ్చే ఫ్రెండ్స్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దు.
బలమైన పాస్‌వర్డ్‌లు.. మీ సోషల్ మీడియా ఖాతాలకు క్లిష్టమైన పాస్‌వర్డ్‌లను వాడండి. తరచుగా పాస్‌వర్డ్‌లను మార్చడం అలవాటు చేసుకోండి. మీకు వచ్చిన సందేశాల్లోని అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. అవి ఫిషింగ్ దాడులకు దారితీసే అవకాశం ఉన్నట్లు పోలీసులు సూచిస్తున్నారు. మీ ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తిస్తే.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు (జాతీయ హెల్ప్‌లైన్ 1930 లేదా సైబర్ క్రైమ్ పోర్టల్) ఫిర్యాదు చేయండి. మీ పరిచయస్తులకు కూడా సమాచారం అందించండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa