ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలాలు.. పాత లే ఔట్ల ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఫిర్యాదులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 17, 2025, 08:11 PM

వ‌ర్షాల వేళ‌.. న‌గ‌రంలో నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  నాలాల మీద స్లాబులు వేసి.. ఇంటి ఆవ‌ర‌ణ‌గా మార్చేస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. అక్క‌డ నాలాల్లో పేరుకుపోయిన చెత్త‌ను తొల‌గించ‌డం సాధ్యం కాక అవి పూడుకుపోతున్నాయ‌ని ప‌లువురు పేర్కొన్నారు. మ‌ల్కాజిగిరి, బాచుప‌ల్లి, సికింద్రాబాద్‌లోని ప‌ద్మారావున‌గ‌ర్, మాధాపూర్ ఇలా న‌గ‌రం న‌లువైపుల నుంచి నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఫిర్యాదులందాయి.  వీటితో పాటు.. ఒక‌ప్ప‌టి గ్రామ‌పంచాయ‌తీ లే ఔట్ల‌ను తిరిగి వ్య‌వ‌సాయ భూములుగా చిత్రీక‌రించి త‌ప్పుడు పాస్ పుస్త‌కాల‌తో కొంత‌మంది వార‌సులు, క‌బ్జా దారులు కాజేస్తున్నార‌ని ప‌లువురు వాపోయారు.  సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి వ‌చ్చిన 47 ఫిర్యాదుల్లో ఎక్కువ మొత్తం పాత లే ఔట్లు, నాలాల ఆక్ర‌మ‌ణ‌ల‌పైనే ఉన్నాయి.  గూగుల్‌, ఎన్ ఆర్ ఎస్‌సీ, గ్రామీణ మ్యాప్స్‌తో ఫిర్యాదుల‌ను శ్రీ‌ ఏవీ రంగ‌నాథ్ గారు క్షుణ్ణంగా ప‌రిశీలించారు. పాత లే ఔట్ల‌లో ర‌హ‌దారులు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడుతూనే.. అమాయ‌కులు మోస‌పోకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఫిర్యాదుదారుల‌కు భ‌రోసా ఇచ్చారు.  చెరువు ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌లో మాదిరే నాలాలు ఆక్ర‌మించి నిర్మించిన ఇళ్లు, అపార్టుమెంట్లు కొనేట‌ప్పుడు అన్నీ స‌రి చూసుకోవాల‌న్నారు. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా, ఘ‌ట్‌కేస‌ర్ మండ‌లం, పోచారం మున్సిపాలిటీ, కొరెముల గ్రామం  739 నుంచి 749 వ‌ర‌కూ ఉన్న స‌ర్వే నంబ‌ర్ల‌లో  మొత్తం 147 ఎక‌రాల‌లో ఏక‌శిలాన‌గ‌ర్ లే ఔట్‌ను 1985వ సంవ‌త్స‌రం వేశారు. 2006లో అందులోని 47 ఎక‌రాల మేర వ్య‌వ‌సాయ భూమిగా మార్చేసి లే ఔట్ స్వ‌రూపాన్నే ఓ వ్య‌క్తి మార్చేశార‌ని అక్క‌డి ప్లాట్ల య‌జ‌మానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.  ఇదే లే ఔట్‌లో రెండు బ‌డా రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు ప్ర‌హ‌రీలు నిర్మించి కొంత‌మేర కాజేశార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోచారం మున్సిపాలిటీ కొరెముల గ్రామం 796 స‌ర్వే నంబ‌ర్‌లో 11.20 ఎక‌రాల భూమి ఉండ‌గా.. ఇందులో 7.20 ఎక‌రాల ప‌రిధిలో ఓ మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేశార‌ని.. మిగ‌తా 4 ఎక‌రాల  త‌మ భూమితో పాటు.. న‌దెం చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఈ నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు.  


పంజాగుట్ట కాల‌నీలోని ఆఫీస‌ర్స్ కాల‌నీలో వెయ్యి గ‌జాల పార్కు స్థ‌లం ఉండేద‌ని.. ఇందులోని 500 గ‌జాల స్థ‌లంలో దుర్గాభ‌వానీ ఆల‌యంను నిర్మించార‌ని.. మిగిలిన 500 గ‌జాల స్థ‌లం క‌బ్జా కాకుండా పార్కును అభివృద్ధి చేయాల‌ని అక్క‌డి నివాసితులు హైడ్రాను ఆశ్ర‌యించారు.  ఆల‌యంతో పాటు.. చుట్టూ ఉన్న దుకాణ స‌ముదాయాల ఆదాయంతో పార్కును అభివృద్ధి చేసేలా చూడాల‌ని కోరారు. అలాగే శ్రీ‌న‌గ‌ర్ నుంచి వ‌చ్చే వ‌ర‌ద కాలువ త‌మ కాల‌నీకి ఆనుకుని వెళ్లేద‌ని.. ఇప్పుడా కాలువ మాయం కావ‌డంతో వ‌ర‌దంతా త‌మ ఇళ్ల‌ను ముంచెత్తుతోంద‌ని వాపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa