తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ పట్టణంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కీలకమైన ప్రధాన రహదారి విస్తరణ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. మూలవాగు వంతెన నుంచి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వరకు సుమారు 750 మీటర్ల మేర ప్రస్తుత రహదారిని 80 అడుగుల వెడల్పుతో విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 54 ఏళ్లుగా కొనసాగిన ఈ ప్రతిపాదన ఆలయ పట్టణం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు, అభివృద్ధి అవరోధాలకు ముగింపు పలికే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయానికి నిత్యం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. పెరుగుతున్న భక్తుల సంఖ్య, పట్టణ విస్తీర్ణం, మరియు జనాభా గణనీయంగా పెరగడంతో ఇరుకుగా ఉన్న రహదారుల విస్తరణ అనివార్యమైంది. ఈ రోడ్డు విస్తరణ కోసం 1971లోనే అప్పటి సెస్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావుతో పాటు కొందరు స్థానికులు విజ్ఞప్తి చేయగా, అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ వెంకటరమణ ప్రతిపాదనలు రూపొందించారు.
అయితే, కొందరు స్థానిక నాయకుల వ్యతిరేకతతో ఈ పనులు అప్పట్లో ముందుకు సాగలేదు. 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కనుమూరి బాపిరాజు ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు నిర్మించినా.. ప్రధాన మార్గాల సమస్య అలాగే ఉంది. స్మితా సబర్వాల్ కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో 100 అడుగుల రహదారిగా విస్తరించాలని కూడా ప్రతిపాదనలు చేశారు. కానీ అవి కూడా కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది, దీంతో తిప్పాపూర్ వద్ద ఉన్న బస్టాండ్ నుంచి ఆలయానికి చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది. గతంలో 10 వేలలోపు ఉన్న పట్టణ జనాభా ప్రస్తుతం 60 వేలకు చేరుకుంది. ఈ అంశాలన్నీ రోడ్డు విస్తరణ ఆవశ్యకతను మరింత స్పష్టం చేశాయి.
వేములవాడలో జోరుగా కూల్చివేతలు.. కారణం ఏంటంటే..
కూల్చివేతల ప్రక్రియ..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వేములవాడ శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) ఆది శ్రీనివాస్ చొరవతో ఈ దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కింది. గత ఏడాది నవంబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు విస్తరణకు సుమారు రూ.47 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ నిధులన్నీ రోడ్ల విస్తరణలో నష్టపరిహారం కోసం కేటాయించబడ్డాయి.
ఈ ప్రాజెక్టులో 260 మందికి పైగా నివాసాలు, దుకాణాలు కోల్పోతుండగా.. ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇప్పటికే 100 మందికి నష్టపరిహార చెక్కులను అందజేసింది. కోర్టు స్టే ఉన్న గృహాలను మినహాయించి.. మిగిలిన వాటిని తొలగిస్తున్నారు. కొందరు తమ భూసేకరణను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా.. వారికి సంబంధించిన చెక్కులను అధికారులు కోర్టులోనే డిపాజిట్ చేశారు. అధికారులు 15 రోజుల కిందటే ఇళ్లు, దుకాణాలు ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు జారీ చేసినప్పటికీ.. చాలామంది ఇంకా ఖాళీ చేయకపోవడంతో.. ఆదివారం నాటికి ఖచ్చితంగా ఖాళీ చేయాలని, లేనిపక్షంలో బలవంతంగా తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు.
భవిష్యత్ లక్ష్యాలు..
రోడ్డు వెడల్పు పనుల తొలిదశలో భాగంగా.. స్థానిక పురపాలక సంఘానికి చెందిన మాంసం మార్కెట్ ప్రాంగణాన్ని జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ప్రధాన రహదారి వెంట ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వాణిజ్య సముదాయాన్ని కూల్చగా.. నాలుగు రోజుల్లోగా రహదారికి ఇరువైపులా సేకరించిన భవనాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయం ముందు భాగం నుంచి మూలవాగు వంతెన వరకు 144 సెక్షన్ విధిస్తూ తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. పనులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో రాధాబాయి పర్యవేక్షించారు.
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, రోడ్ల వెడల్పును గత ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి.. ఆ తర్వాత పట్టించుకోకుండా దేవుడినే మోసం చేశారు అని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు వెడల్పు పనులు ప్రస్తుతం ప్రారంభమయ్యాయని.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోతున్న వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చామని వివరించారు. ఈ ప్రాజెక్టు వేములవాడను మరింత అభివృద్ధి పథంలో నడిపించి.. భక్తులకు, స్థానికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుందని ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa