దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వేములవాడను అభివృద్ధి చేయడం ద్వారా భక్తుల సంఖ్య పెరగడమే కాకుండా, ఈ ప్రాంతం పర్యాటకంగానూ వర్ధిల్లుతుంది. ఇప్పటికే గుడి చెరువు ట్యాంక్‌బండ్ అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయి. బండ్‌పై పార్కు నిర్మాణం దాదాపు పూర్తవచ్చింది. సమీపంలోని నాంపల్లిగుట్ట ఇప్పటికే పర్యాటక కేంద్రంగా ఆకట్టుకుంటోంది. దీని పక్కనే ఉన్న మధ్యమానేరు జలాశయం అందాలను గుట్ట పైనుంచి వీక్షించవచ్చు. మధ్యమానేరు వద్ద బోటు తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది.
వేముల ఆలయాన్ని వందేళ్లకు సరిపడా మాస్టర్ ప్లాన్‌తో అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆధునిక వసతులతో కూడిన అనేక నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో క్యూ కాంప్లెక్స్, ఆలయానికి నాలుగు వైపులా ప్రాకారాలు, గోపురాలు, కల్యాణ మండపం, అవేటి మండపం, వసతి గృహాలు, ఆలయ కార్యాలయాలు, విశాలమైన నూతన ధర్మగుండం, యాగశాల, కోడె మొక్కులు, ఆధునిక కల్యాణకట్ట, తిరుమల తరహాలో నిత్యాన్నదాన సత్రం వంటివి ఉండనున్నాయి.
ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో గత ఏడాది నవంబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలువురు మంత్రులతో కలిసి రూ.76 కోట్లతో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.47 కోట్లతో రహదారి విస్తరణ పనులకు, రూ.35 కోట్లతో నిత్యాన్నదాన సత్రం నిర్మాణాలకు సైతం శంకుస్థాపనలు చేశారు. ఈ బడ్జెట్‌లో ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.150 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఆలయం నుంచి మూలవాగు వంతెన వరకు రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డును 80 అడుగులకు విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దనున్నారు.
ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను మూడు దశల్లో చేపట్టేందుకు దాదాపు రూ.550 కోట్ల అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేశారు. శృంగేరి పీఠాధిపతులను పలుమార్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ అధికారులు, స్థపతులు కలిసి సూచనలు పొందారు. ఆలయంలోని చారిత్రక, పురాణాల నేపథ్యం ఉన్న ఏ విగ్రహాలను ముట్టకుండానే ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని దాదాపు 40 ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.76 కోట్లతో చేపట్టే ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. వేములవాడ అభివృద్ధి ఈ ప్రాంతానికి కొత్త శోభను తీసుకురానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa