ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి మండలానికి రెండు గ్రామ పంచాయతీ భవనాలు, రెండు అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 22, 2025, 11:02 PM

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన పరిపాలన, మౌలిక వసతులు కల్పించాలనే బలమైన సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా.. ప్రతి మండలానికి రెండు గ్రామ పంచాయతీ భవనాలు , మరో రెండు అంగన్వాడీ కేంద్రాలు నిర్మించాలనే ఆశయంతో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యకలాపాలను వేగవంతం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో స్థలాల గుర్తింపులో తలెత్తిన జాప్యం నుంచి పాఠాలు నేర్చుకొని, ఈసారి ప్రారంభం నుంచే ఈ బృహత్తర ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లె ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే ఈ విస్తృత ప్రణాళికకు ప్రధాన ఉద్దేశ్యం.


పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఈ ప్రాజెక్టును అత్యంత కీలకంగా పరిగణిస్తూ.. వ్యక్తిగత పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులతో ఆమె నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ.. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంత్రి చొరవతో.. ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలోనే గణనీయమైన ప్రగతి నమోదైంది. 1148 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ఇప్పటికే 813 స్థలాలను విజయవంతంగా గుర్తించారు. మిగిలిన 98 చోట్ల భూముల గుర్తింపు పెండింగ్‌లో ఉంది. అదేవిధంగా.. 1144 గ్రామ పంచాయతీ భవనాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో.. మొదటి త్రైమాసికం ముగియకముందే 549 గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. మరో 84 చోట్ల భూసేకరణ మిగిలి ఉంది. మిగిలిన నిర్మాణాలు గతంలోనే ప్రారంభమై, ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి.


అయితే.. భూసేకరణ ప్రక్రియలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి వంటి హైదరాబాద్‌ శివారు జిల్లాలు, ఏజెన్సీ ప్రాంతాలున్న ఆదిలాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో స్థలాల గుర్తింపు కొంత సవాలుగా మారింది. ఈ సమస్యలను అధిగమించడానికి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ సృజన జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా సంభాషిస్తూ, భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమన్వయ కృషి ద్వారా మరి కొద్ది రోజుల్లో స్థల సేకరణ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.


ఈ నిర్మాణాలకు నిధుల విషయంలోనూ స్పష్టమైన ప్రణాళిక ఉంది. ఒక్కో గ్రామ పంచాయతీ భవనం కోసం ఉపాధి హామీ నిధుల ద్వారా రూ.20 లక్షలు ఖర్చు చేయనున్నారు. అంగన్వాడీ భవనాలకు ఉపాధి హామీ నిధుల ద్వారా రూ.8 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.2 లక్షలు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.2 లక్షలు వెచ్చించి, మొత్తం రూ.12 లక్షలు కేటాయించనున్నారు.


మంత్రి సీతక్క ప్రత్యేకంగా ఈ భవనాలకు ప్రత్యేకమైన, సులభంగా గుర్తించదగిన డిజైన్‌లు ఉండాలని ఆదేశించారు. తెలంగాణలో ఎక్కడికెళ్లినా.. ఈ భవనాలను చూడగానే అవి గ్రామ పంచాయతీలేనా, అంగన్వాడీ కేంద్రాలేనా అని ప్రజలు గుర్తించగలిగేలా డిజైన్‌లు రూపొందించాలని ఆమె సూచించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఇప్పటికే ఈ మేరకు వేర్వేరు డిజైన్‌లను సిద్ధం చేస్తోంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయడం ద్వారా వచ్చే మార్చి నాటికి మొత్తం 1148 జీపీ భవనాలు, 1148 అంగన్వాడీ భవనాలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థలాల గుర్తింపు ప్రక్రియ చివరి దశలో ఉన్న నేపథ్యంలో.. త్వరలోనే కొత్త భవనాలకు శంకుస్థాపనలు జరుగుతాయని మంత్రి సీతక్క వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa