సోషల్ మీడియాలో రీల్స్ కోసం నేటి యువత దేనికైనా తెగిస్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేస్తున్నారు. రోడ్లపై ప్రమాదకర స్టంట్స్ చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా.. తోటి ప్రయాణికుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ఒక్క చేతితో బండి నడపడం, బైక్ వెనుక టైర్ పైకి లేపి విన్యాసాలు, స్పీడ్‌గా వెళ్తూ సడన్‌గా బ్రేకులు వేస్తూ రకరకాల ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. వీటన్నింటినీ వీడియోలు తీసి రీల్స్ రూపంలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ రీల్స్ పిచ్చి పరాకాష్టకు చేరి.. చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, తీవ్ర గాయాలపాలు కావడం చూస్తున్నాం. అయితే తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది.
హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ అలాంటి ఘటనే జరిగింది. ఒకే బైక్ పై ఏకంగా ఎనిమిది మంది యువకులు ప్రయాణం చేస్తూ కలకలం సృష్టించారు. ప్రమాదకరంగా ప్రయాణం చేయడమే కాకుండా.. వాహనదారులనూ ఇబ్బందికి గురిచేశారు. బైక్‌పై ఇద్దరి కంటే ఎక్కువ మంది వెళ్లకూడదనే రూల్ ఉన్నా.. దాన్ని అతిక్రమించి ఎనిమిది మంది ప్రయాణించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి పోలీసుల దృష్టికి చేరింది. ఆ వీడియోలు కనిపిస్తున్న బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణించింది అంతా యువకులే కావడం గమనార్హం. ఈ మధ్య కాలంలో యువతలో నేర ప్రవృత్తి గణనీయంగా పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్‌లోని జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనం. జీడిమెట్ల ప్రాంతంలో పదో తరగతి చదివే 16ఏళ్ల బాలిక.. ప్రేమకు అడ్డొస్తోందని తల్లినే హతమార్చింది. ప్రియుడు, ఆమె సోదరుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. బాధితురాలు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు అని తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఆధునిక పోకడ, ఆర్థిక- సామాజిక ఒత్తిళ్లు, మోడర్న్ లైఫ్‌స్టైల్‌తో పాటు సాంకేతిక విప్లవం.. యువతలో సరికొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయి. ఇవన్నీ యువతలో నేర ప్రవృత్తి పెరగడానికి దారితీస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి దొంగతనాలు, కొట్లాటల నుంచి.. హత్యలు, సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం వంటి వాటిలో కూడా యువత హస్తం ఉంటోంది. ఇది భవిష్యత్ సమాజానికి ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. అయితే యువతలో నేర ప్రవృత్తిని అరికట్టడం కేవలం ప్రభుత్వానికో, పోలీసులకో సంబంధించిన పని కాదు. ఇది సామాజిక బాధ్యత. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే ఆరోగ్యకరమైన, నేర రహిత సమాజాన్ని నిర్మించగలం. లేకపోతే, భవిష్యత్తు తరాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa