హైదరాబాద్ నగరంలో వరద ముప్పును తగ్గించి, పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా హైడ్రా కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలోని చారిత్రక గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించింది. వర్షాకాలంలో నీరు రోడ్లు, నివాస ప్రాంతాలను ముంచెత్తకుండా నేరుగా చెరువుల్లోకి చేరేలా చూడటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. తొలి విడతగా ఆరు చెరువులను పునరుద్ధరించే పనులను హైడ్రా ప్రారంభించింది.చెరువులు, నాలాల పరిరక్షణ అత్యంత ఆవశ్యకమని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని హైడ్రా స్పష్టం చేసింది. దురదృష్టవశాత్తూ అనేక చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని, దీనివల్ల నగరంలో వరద సమస్య తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆక్రమణలను అరికట్టేందుకు నగర పౌరుల సహకారం కూడా ఎంతో కీలకమని హైడ్రా అభిప్రాయపడింది.ఈ నేపథ్యంలో, ప్రజలు తమ పరిసరాల్లో చెరువులు, నాలాలు కబ్జాకు గురవుతున్నట్లు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని హైడ్రా విజ్ఞప్తి చేసింది. ఇందుకుగాను ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 8712406899 ను కేటాయించింది. కబ్జాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో పాటు, ఆ ప్రాంతాన్ని స్పష్టంగా తెలియజేసే లొకేషన్‌ను కూడా ఈ వాట్సాప్ నంబర్‌కు పంపించాలని సూచించింది.ఇవే కాకుండా 'కమిషనర్ హైడ్రా' పేరిట ఉన్న అధికారిక ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల ద్వారా కూడా ప్రజలు సమాచారాన్ని చేరవేయవచ్చని హైడ్రా తెలిపింది. అత్యవసరమైతే, హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు నేరుగా 7207923085 నంబర్ ద్వారా కూడా సమాచారం అందించవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రజల భాగస్వామ్యంతోనే చెరువుల పరిరక్షణ సాధ్యమవుతుందని, నగరాన్ని వరదల నుంచి కాపాడుకోవచ్చని హైడ్రా ఆశాభావం వ్యక్తం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa