తెలంగాణను మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ఈ విషయంలో సినీ పరిశ్రమ కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయనతో పాటు నటులు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ పాల్గొని డ్రగ్స్‌పై తమ గళం విప్పారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, యువతకు దిశానిర్దేశం చేశారు.దిల్ రాజు మాట్లాడుతూ, మలయాళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరించే నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. "అక్కడ ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే, వారిని పరిశ్రమ నుంచి బహిష్కరిస్తారు. తెలంగాణ ఎఫ్‌డీసీ తరపున తెలుగు చిత్ర పరిశ్రమ తరపున నేను కోరేది ఒక్కటే. మన దగ్గర కూడా అలాంటి సంఘటనలు జరిగితే సంబంధిత వ్యక్తులను ఇండస్ట్రీలో అడుగు పెట్టకుండా నిషేధించాలి. అప్పుడే సమాజానికి బలమైన సందేశం వెళుతుంది" అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని చిత్ర పరిశ్రమ పెద్దలతో చర్చించి, తెలుగు సినిమాల్లో కూడా ఈ నిబంధన పాటించేలా చర్యలు తీసుకుంటామని, ఇది మనందరి కర్తవ్యమని దిల్ రాజు పేర్కొన్నారు. డ్రగ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అంతా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.నటుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, తాను సాధారణంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటానని, అయితే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ప్రాముఖ్యతను పోలీస్ అధికారులు వివరించిన తర్వాత దీనిపై మాట్లాడటం బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. "ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఆ దేశ యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే సరిపోతుంది. కొన్ని దేశాలు మన యువతకు మత్తు పదార్థాలు అలవాటు చేసి, దేశ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తాయని, ఒక్కసారి వాటికి బానిసైతే కోలుకోవడం చాలా కష్టమని హెచ్చరించారు. స్నేహితులు డ్రగ్స్ అలవాటు చేస్తే వారికి దూరంగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉంటూ, వ్యాయామం చేస్తూ, తల్లిదండ్రులకు గౌరవం తెచ్చే పనులు చేయాలని సూచించారు. విజయం, డబ్బు, గౌరవం లేని పనులు చేయడం అనవసరమని ఆయన అన్నారు.అనంతరం నటుడు రామ్ చరణ్ మాట్లాడుతూ, తన చిన్నతనంలో పాఠశాల తరపున ఇలాంటి అవగాహన కార్యక్రమాలకు వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. "ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. గతంలో కొన్ని పాఠశాలల బయట డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. అప్పుడు నేను తండ్రిని కాదు, కానీ ఇప్పుడు నేనొక తండ్రిని" అని ఆయన అన్నారు.ఒక మంచి సినిమా చేసినప్పుడు, పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినప్పుడు, స్నేహితులతో ఆడుకున్నప్పుడు కలిగే ఆనందం గొప్పదని, రోజూ వ్యాయామం చేస్తూ నచ్చిన పని చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉండాలని యువతకు సూచించారు. "మన కుటుంబంతో మొదలుపెట్టి, పాఠశాల, సమాజాన్ని బాగు చేసుకుందాం. ఈ విషయంలో పోలీసు శాఖ చేస్తున్న కృషి అభినందనీయం. ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడిలా మారి డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం" అని రామ్ చరణ్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa