ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సున్నం చెరువులో అత్యధికంగా సీసం,,,,ఆ నీటిని వాడొద్దన్న హైడ్రా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 27, 2025, 07:34 PM

హైదరాబాద్ మహానగరంలోని చెరువుల పునరుజ్జీవనం కోసం హైడ్రా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. తాజాగా చెరువుల్లోని నీటి నాణ్యత కోసం చేపట్టిన పరిశోధనల్లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదటి దశలో భాగంగా మాదాపూర్‌లోని సున్నం చెరువుపై దృష్టి సారించిన హైడ్రా .. ఆ చెరువు నీటి నమూనాలను సేకరించి, కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో పరీక్షించింది. ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలు అత్యంత ప్రమాదకర స్థాయిలో కలుషితమైనట్లు పరీక్షల్లో తేలింది.


సున్నం చెరువు నీటిని నిత్యావసరాలకు కూడా వినియోగించవద్దని హైడ్రా నగరవాసులకు స్పష్టం చేసింది. ఈ నీటిలో సాధారణ స్థాయి కంటే 12 రెట్లు అధికంగా సీసం (Lead) ఉన్నట్లు గుర్తించారు. సీసం అనేది మానవ ఆరోగ్యానికి అత్యంత హానికరం. దీని అధిక సాంద్రత మెదడు, కిడ్నీలు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పిల్లల్లో మానసిక ఎదుగుదలపై ఇది శాశ్వత ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెరువు సమీపంలో నివసించే ప్రజలు తాగునీటితో పాటు ఇతర అవసరాలకు ఈ నీటిని వాడితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ నీటిని వాడొద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.


సున్నం చెరువు కాలుష్యానికి ప్రధాన కారణాల్లో పరిశ్రమల వ్యర్థాలు, మురుగునీరు, నిర్మాణ వ్యర్థాలు కలిసిపోవడం, రసాయన పదార్థాల లీకేజీలు అయి ఉండవచ్చని హైడ్రా ప్రాథమికంగా అంచనా వేస్తోంది. సరైన మురుగునీటి శుద్ధి ప్లాంట్లు లేకపోవడం, పారిశ్రామిక వ్యర్థాలను చెరువులోకి విడుదల చేయడం వంటివి పరిస్థితిని మరింత దిగజార్చాయాని అధికారులు చెబుతున్నారు. తాజా నీటి నాణ్యత పరీక్షలతో సున్నం చెరువు పునరుజ్జీవన ప్రక్రియకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. హైడ్రా, స్థానిక అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో ఈ చెరువును శుభ్రపరచడానికి, నీటి నాణ్యతను మెరుగుపరచడానికి సమగ్ర ప్రణాళికలను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, హైదరాబాద్‌లోని ఇతర చెరువుల పరిస్థితి కూడా ఇలాగే ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa