ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్‌ చేసుకోవచ్చు.. కేంద్రం కొత్త నిబంధన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 06:30 PM

ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. దీని ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసుకోవచ్చు. అయితే అలా ఫోన్లను ట్యాప్ చేయాలంటే కేంద్ర హోం శాఖ అనుమతి తప్పనిసరి. తెలంగాణలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో పీసీసీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురి ఫోన్‌లు అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నిఘా కార్యకలాపాలు చట్టబద్ధంగా ఉండేలా ఈ కొత్త నిబంధన దోహదపడుతుందని కేంద్రం భావిస్తోంది.


రాష్ట్ర సరిహద్దుల వెలుపల ఉన్న వ్యక్తుల ఫోన్‌లను ట్యాప్ చేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన టెలికమ్యూనికేషన్స్ నిబంధనలు-2024 (చట్టబద్ధమైన ట్యాపింగ్‌కు నిబంధనలు, జాగ్రత్తలు) లో సవరణ చేస్తూ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ముసాయిదా ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రతిపాదన ఇటీవల తెలంగాణలో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.


ప్రస్తుతం ఉన్న నిబంధన 2(సి) ప్రకారం, కేంద్ర ప్రభుత్వ పరిధిలో అయితే కేంద్ర హోం శాఖ కార్యదర్శి, రాష్ట్ర పరిధిలో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి మాత్రమే ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతి ఇచ్చే అధికారం కలిగి ఉన్నారు. ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త నిబంధన ప్రకారం.. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాదేశిక సరిహద్దులకు బయట ఉన్న వ్యక్తుల ఫోన్‌లను ట్యాప్ చేయడానికి కేంద్రం అనుమతి తప్పనిసరి. ఈ ప్రక్రియలో సంబంధిత రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి నుంచి విజ్ఞప్తి అందిన తర్వాత, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి ఇవ్వడానికి అవకాశం కల్పించారు.


ప్రజా అత్యవసర పరిస్థితి, ప్రజా భద్రత ప్రయోజనాలు వంటి సందర్భాల్లో కేంద్రం గానీ, రాష్ట్రం గానీ ట్యాపింగ్‌కు అనుమతి ఇవ్వొచ్చు. ముఖ్యంగా దేశ సార్వభౌమత్వం, సమగ్రత, దేశ రక్షణ, భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, శాంతిభద్రతల ప్రయోజనాలు కాపాడటానికి లేదా జరగబోయే నేరాన్ని ముందుగా అరికట్టడానికి ఇది అవసరమని అధీకృత అధికారి సంతృప్తి చెందినప్పుడు మాత్రమే ఈ నిబంధనను అమలు చేస్తారు.


ఈ కొత్త నిబంధన ప్రతిపాదన వెనుక తెలంగాణలో గత కొన్ని నెలలుగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి పీసీసీ, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సహా అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారుల ఫోన్‌లను అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు.


తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర సరిహద్దుల వెలుపల, ముఖ్యంగా ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్న కీలక వ్యక్తుల కదలికలను, సంభాషణలను పసిగట్టడానికి చట్టవిరుద్ధంగా ఫోన్‌లను ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణల్లో ఒకటి. దీని ద్వారా రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ విధానాలపై విమర్శకులు, మీడియా ప్రతినిధులపై నిఘా పెట్టారని ఆరోపణలున్నాయి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా నిరోధించడానికి, చట్టబద్ధమైన పద్ధతుల్లో మాత్రమే నిఘా కార్యకలాపాలు జరిగేలా చూడటానికి ఈ కొత్త నిబంధన దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ ముసాయిదా ప్రకటనపై సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను 30 రోజుల్లోపు జాయింట్ సెక్రటరీ (టెలికాం), టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్, కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సంచార్ భవన్, 20-అశోకా రోడ్, న్యూఢిల్లీ-110001 చిరునామాకు పంపవచ్చునని చెప్పారు. ఈ నిబంధనలు అంతిమంగా అమలులోకి వస్తే.. దేశంలో నిఘా కార్యకలాపాలు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరిగే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa