తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యమని, గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగరేస్తామని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సభలో ఆయన తొలిసారిగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తనను సౌమ్యుడిగా భావించవద్దని, ప్రజా సమస్యలపై పోరాటంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని ఆయన హెచ్చరించారు.ఎంతోమంది కార్యకర్తలు, నేతల త్యాగాల పునాదులపైనే బీజేపీ నేడు ఈ స్థాయిలో నిలిచిందని రామచందర్‌రావు అన్నారు. "ప్రజాస్వామ్యబద్ధమైన, వికసిత తెలంగాణ నిర్మాణం బీజేపీతోనే సాధ్యం. అందుకే ప్రజలు మనవైపు ఆశగా చూస్తున్నారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలి" అని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి జాతీయ నాయకత్వం సహకారంతో తెలంగాణలో పార్టీని మరింత ముందుకు నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.కొందరు తనను సౌమ్యుడిగా అభివర్ణిస్తున్నారని, కానీ అది నిజం కాదని రామచందర్‌రావు అన్నారు. "నేను సౌమ్యుడిని కాదు. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాడుతున్నాను. విద్యార్థుల హక్కుల కోసం పోరాడి 14 సార్లు జైలుకు వెళ్లాను. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నాను. ప్రభుత్వంపై నా పోరాటం ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటుంది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతాను" అని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై రామచందర్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "కాంగ్రెస్ పార్టీ ఒక ఫేక్ న్యూస్ యూనివర్సిటీని నడుపుతోంది. సోషల్ మీడియాలో బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్నారు. వారి తప్పుడు ప్రచారాలను మనం సమర్థంగా తిప్పికొట్టాలి" అని ఆయన కార్యకర్తలకు సూచించారు.ప్రపంచంలోనే 14 కోట్ల సభ్యత్వాలతో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందని రామచందర్‌రావు తెలిపారు. తాను అధ్యక్షుడిగా కాకుండా ఒక సాధారణ కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు. "మన పార్టీలో కొత్త, పాత అనే తేడాలు లేవు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ బీజేపీ కుటుంబ సభ్యులే. పార్టీలోకి కొత్త రక్తం రావాలి. యువత, మహిళలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరి పార్టీని బలోపేతం చేయాలి" అని ఆయన కోరారు. ప్రజలు, కార్యకర్తలు, నేతలు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa