పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో పాశమైలారంలో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో విషాదం కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద ఈరోజు హృదయాలను ద్రవింపజేసే దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా కన్నీటి సంద్రంగా మారింది. ఏ మృతదేహం ఎవరిదో తెలియని అయోమయ స్థితిలో బంధువులు మార్చురీ వద్ద పడిగాపులు కాస్తున్నారు.ప్రమాద తీవ్రతకు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోవడంతో, వాటిని గుర్తించడం అధికారులకు పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించే ప్రక్రియను వైద్య శాఖ అధికారులు చేపట్టారు. డీఎన్ఏ నివేదికలు అందిన తర్వాతనే, నిర్ధారించుకుని మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో కుటుంబ సభ్యుల ఆవేదన మరింత పెరుగుతోంది.ఇదిలా ఉండగా, ఇప్పటివరకు గుర్తించిన 11 మంది మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అనంతరం ఈ 11 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు నలుగురు, తెలంగాణకు చెందిన వారు ఒకరు, ఒడిశా నుంచి ముగ్గురు, బీహార్ నుంచి ఇద్దరు, ఉత్తరప్రదేశ్ నుంచి ఒకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa