ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాశమైలారం ఘటనకు,,,సిగాచి పరిశ్రమ నిర్లక్ష్యమే కారణం,,ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 04:21 PM

తెలంగాణ చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనలలో ఒకటిగా పాశమైలారం ప్రమాద ఘటన నిలిచింది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి రసాయన పరిశ్రమలో జూన్ 30 సంభవించిన భారీ పేలుడు కారణంగా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. రిశ్రమలోని మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్‌లో రియాక్టర్ పేలడం వల్ల ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసిన FIRలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.


సిగాచీ ఫ్యాక్టరీ సరైన ప్రమాణాలు పాటించట్లేదని పోలీసులు వెల్లడించారు. ఇక ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేందుకు కూడా ఫ్యాక్టరీలో సరైన మార్గం లేదని పేర్కొన్నారు. మెషినరీ పాతది కావడం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమూ ప్రమాదానికి ప్రధాన కారణమన్నారు. కంపెనీ ఉద్యోగులు ఇదే విషయాన్ని యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వాటినే ఉపయోగించినట్లు ఎఫ్ఐఆర్‌లో పోలీసులు వెల్లడించారు.


కాగా, సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. పేలుడు తీవ్రతకు మూడు అంతస్తుల అడ్మినిస్ట్రేటివ్ భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఫ్యాక్టరీలో ఘాటైన వాసనలు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 100కు పైగా కార్మికులు పని చేస్తున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 40 కార్మికులు మరణించారు. మృతుల్లో బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నారు. చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో, వాటిని గుర్తించడానికి DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు.


 ఘటనలో 35 మందికి పైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 57 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు సిగాచి కంపెనీ మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం ప్రకటించింది.


ప్రమాదం జరిగిన సిగాచి పరిశ్రమ వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదంపై అత్యున్నత కమిటీతో విచారణ జరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఘటన తర్వాత కార్మికుల భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి పారిశ్రామిక భద్రతా నిబంధనలను కఠినతరం చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa