ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారంలో 2026 జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ అపురూపమైన పండుగ జరగనుందని పూజారుల సంఘం ప్రకటించింది. ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసే ఈ జాతర, లక్షలాది మంది భక్తులను ఆకర్షించి, దైవత్వాన్ని చాటిచెబుతుంది.
మేడారం జాతర సుమారు 900 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గిరిజన పండుగ. కాకతీయ రాజుల కాలంలో పన్నుల వసూలుకు వ్యతిరేకంగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వంటి వనదేవతలు తమ ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారనే కథ దీని వెనుక ఉంది. వారి త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, గిరిజనుల ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తికి ప్రతీక. ఈ జాతరను తెలంగాణ కుంభమేళా గానూ అభివర్ణిస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుండటంతో 2025 ఫిబ్రవరిలో మేడారంలో మినీ జాతర నిర్వహించారు.
2026 జాతర ముహూర్తాలు, పూజల విధానం..
2026 జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను మేడారం గద్దెలపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు.. జనవరి 29న సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు. ఈ దృశ్యం అశేష భక్తజనాన్ని పులకింపజేస్తుంది. మూడో రోజు, జనవరి 30న భక్తులు వనదేవతలకు తమ మొక్కులను చెల్లించుకుంటారు. నాల్గో రోజు, జనవరి 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవిందరాజు, పగిడిద్దరాజు దేవుళ్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది.
గత సంవత్సరాల్లో.. తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక షెల్టర్లు, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలను కల్పించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడుపుతుంది. భద్రతా ఏర్పాట్లలో భాగంగా, వేలాది మంది పోలీసులు, హోం గార్డులను మోహరించి, సీసీ కెమెరాల నిఘాతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూజారులు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.105 కోట్లతో మేడారం జాతర కోసం ఏర్పాట్లు చేసింది.
రోడ్డు మార్గం:
హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాల నుంచి నేరుగా బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగత వాహనాల్లో వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. 2024 జాతర సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ ఆర్టీసీ 6 వేల బస్సులను నడిపింది. 51 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సైతం నడిపింది. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది.
రైలు మార్గం:
సమీప రైల్వే స్టేషన్ వరంగల్ (Warrangal Railway Station). అక్కడి నుంచి బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా మేడారం చేరుకోవచ్చు.
విమాన మార్గం:
సమీప విమానాశ్రయం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport, Hyderabad). అక్కడి నుంచి బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా మేడారం చేరుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa