తెలంగాణలో విద్యారంగ సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ఇక నుంచి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐసీసీసీలో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు పలు కీలక ఆదేశాలు, సూచనలు చేశారు. పదో తరగతిలో పెద్ద సంఖ్యలో ఉత్తీర్ణత కనిపిస్తున్నప్పటికీ.. ఇంటర్మీడియట్ పూర్తయ్యేసరికి ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలకు గల కారణాలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమైనందున, ఆ దశలో వారికి సరైన మార్గదర్శకత్వం లభించాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.
ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్య ఒకే ప్రాంగణంలో కొనసాగుతుందని, అక్కడ డ్రాపౌట్స్ సంఖ్య తక్కువగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సీఎం.. ఇంటర్మీడియట్ వేరుగా ఉండే రాష్ట్రాలతో పాటు 12వ తరగతి వరకు పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లోనూ అధికారులు అధ్యయనం చేసి ఈ విధానంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ విషయంలో విద్యా కమిషన్, సంబంధిత ఎన్జీవోలు, పౌర సమాజం సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. ఇంటర్మీడియట్ విద్య మెరుగుదల కోసం అన్ని దశల్లో చర్చించి, అవసరమైతే శాసనసభలోనూ చర్చకు పెడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్‌లో విద్యార్థుల చేరికతో పాటు వారి హాజరుపైనా దృష్టిపెట్టాలని సూచించారు.
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నమూనాలను ముఖ్యమంత్రి రేవంత్ పరిశీలించారు. ప్రతి పాఠశాల ఆవరణలో భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, నిర్మాణాల ప్రగతిపై ప్రతి వారం తనకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి చొప్పున యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలను చేపడతామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే ఒక్కో పాఠశాలకు సంబంధించి స్థల సేకరణ పూర్తయినందున, రెండో పాఠశాలకు సంబంధించిన స్థల గుర్తింపు, సేకరణ ప్రక్రియపై దృష్టి సారించాలని ఆదేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నిర్మాణ నమూనాను కూడా సీఎం రేవంత్ పరిశీలించి, పలు మార్పులను సూచించారు. సాధ్యమైనంత త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa