తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో జరిగిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలకు ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పూర్తి చేసిందని ఆయన వెల్లడించారు. ఈ లెక్కల్లో ఏమైనా తేడా ఉంటే.. నేను క్షమాపణలు చెప్పడానికైనా సిద్ధం అని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు.
సీఎం మాట్లాడుతూ.. గత పాలకుల 'దొరల గడీ'కి తెరదించి.. ప్రజలకు అండగా నిలిచామని, తమ పాలన మూణ్నాళ్ల ముచ్చటే అని గతంలో ఎగతాళి చేసిన వారికి, నేడు విజయవంతమైన ప్రజా పాలన, సంక్షేమ కార్యక్రమాల అమలుతో సమాధానం చెబుతున్నామని ఆయన ఉద్ఘాటించారు. తాము ఎక్కడ విఫలం అవుతామా అని ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు చెంపపెట్టులా, కేవలం తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా పథకం కింద రూ.9,000 కోట్లను 70 లక్షల మంది రైతులకు అందించామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ నాయకులు రైతులు వరి వేస్తే ఉరి వేసుకోవాలని బెదిరించారని, అయితే తమ ప్రభుత్వం వరి పండించిన రైతులకు బోనస్‌లు ఇచ్చి.. ‘రైతే రాజు’ అనే మాటను నిజం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పేద ప్రజల సంక్షేమం కోసం ఇళ్లు, భూములు పంపిణీ చేశారని, ఆమె పేరు ప్రతి పేద ఇంటిలో వినిపిస్తూనే ఉందని ఆయన తెలిపారు. అందుకే తాము ఏ పథకాలు ప్రారంభించినా ఇందిరమ్మ పేరు పెడతామని, పేదల కడుపు నింపే అన్నపూర్ణ క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు పెడితే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఇందిరమ్మ వలెనే, తాము కూడా ఆడబిడ్డలను గౌరవిస్తామని.. అన్ని సంక్షేమ పథకాలలో మహిళలకే పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం, సోలార్ ప్లాంట్ల నిర్వహణ, ఇందిరా స్వయం సహాయక సంఘాలు వంటి అన్ని కార్యక్రమాలలో మహిళలకు అగ్ర ప్రాధాన్యత ఇస్తామని, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో కులవృత్తుల వారిని అణచివేసి, కేసీఆర్, కేటీఆర్ మాత్రం రాజ్య పాలన చేయాలని కుతంత్రాలు చేశారని ఆరోపించారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని.. ఈ పెట్టుబడుల ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
భారతదేశం 140 కోట్ల జనాభాను కలిగి ఉండి కూడా ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా సాధించలేకపోవడం ప్రపంచం ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే.. తెలంగాణలో నెలకొల్పబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా భవిష్యత్తులో తెలంగాణ యువత భారతదేశానికి బంగారు పతకాలు తెచ్చి చూపిస్తారని ప్రధాని మోడీకి సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరకబోతున్నాయని.. కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చిన చోట బాధపడకుండా, టిక్కెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించే బాధ్యత పార్టీ చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. మంత్రులుగా చేసే బాధ్యత ఖర్గే, రాహుల్ గాంధీ చూసుకుంటారని.. టిక్కెట్ల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని, టిక్కెట్లు ఇచ్చి దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపుతామని పేర్కొన్నారు. ఖర్గేకు మాట ఇస్తున్నానని.. వచ్చే ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు, 100 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa