ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య, భర్త చావులు.. అంధకారమవుతున్న పిల్లల జీవితాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 08:01 PM

కాలం వేగంగా మారుతోంది. ఒకనాడు భర్తలే భార్యలను హత్య చేసిన ఘటనలు వింటే ఆశ్చర్యం కలిగేది. కానీ.. నేడు భార్యలే భర్తలను అంతమొందించే సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరు ఎవరిని అంతమొందించినా, హత్య చేయడం క్షమించరాని నేరం. కుటుంబ కలహాలు ఎంత తీవ్రంగా ఉన్నా, అవి ఆ ఇంటి నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలి. ఒకటి రెండు రోజుల్లో ఆ గొడవ సద్దుమణిగిపోవాలి. లేదంటే.. పెద్దలను, శ్రేయోభిలాషులను సంప్రదించి.. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలి. కానీ.. ఇలాంటి దారుణమైన చర్యలకు పాల్పడటం మానవత్వం లేని పని. ఈ హింసాత్మక ఘటనలలో అత్యంత విషాదకరమైన కోణం ఏమిటంటే.. ఈ గొడవల్లో తల్లిదండ్రులు తమ అల్లారుముద్దుగా పెంచుకున్న సంతానం గురించి అస్సలు ఆలోచించకపోవడం. వారి భవిష్యత్తు అంధకారంలోకి కూరుకుపోతోంది, వారిని పట్టించుకునే నాథుడే లేకుండా పోతున్నాడు.


తాజాగా బాచుపల్లిలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. నారాయణపేట జిల్లాకు చెందిన అంజిలప్ప (32), అతని భార్య రాధలకు ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లగా.. అక్కడ రాధకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అంజిలప్ప, రాధను మందలించి హైదరాబాద్‌లోని బాచుపల్లికి వచ్చారు. అయితే.. రాధ ఆ యువకుడితో మళ్లీ మాట్లాడటం గమనించిన అంజిలప్పకు, ఆమెకు మధ్య తరచుగా గొడవలు జరిగాయి. గత నెల 23న రాత్రి మద్యం మత్తులో ఉన్న అంజిలప్పను రాధ గొంతు నులిమి హత్య చేసింది. ఏమీ తెలియనట్లు నటించి, పక్కనే ఉన్న గుడిసెలో నిద్రించి, మరుసటి రోజు ఉదయం భర్త చనిపోయాడని రోదించింది.


కుటుంబ సభ్యుల అనుమానంతో నారాయణపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో రాజకీయ ఒత్తిడులు పెరగడంతో, స్థానిక పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, కేసును బాచుపల్లి పీఎస్‌కు బదిలీ చేశారు. పోలీసులు రాధను విచారించగా.. ఆమె తన నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే హత్యకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వస్తాయని, సీసీ కెమెరాలను పరిశీలించగా హత్య ఘటనలో ఒక్కరే ఉన్నారని సీఐ ఉపేందర్ తెలిపారు.


కన్నతండ్రి దారుణ హత్య, కన్నతల్లి జైలుపాలు కావడంతో ఆ ఇద్దరు పసి పిల్లలు ఇప్పుడు అనాథలయ్యారు. వారిని చూసుకునే బాధ్యత ఎవరిదో తెలియక.. ప్రస్తుతం అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఈ చిన్నారులు భవిష్యత్తులో సమాజంలో ఎలా బతకాలి..? ‘మీ తండ్రి ఇలా... మీ తల్లి అలా..." అనే సూటిపోటి మాటలకు ఎలా సమాధానం చెప్పాలి..? వారి భవిష్యత్ అంతా తలదించుకునే బతకాలా? తల్లిదండ్రుల మధ్య విభేదాలు, వివాహేతర సంబంధాలు, క్షణికావేశంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు అమాయకమైన పిల్లల జీవితాలను ఎలా చిద్రం చేస్తున్నాయో ఈ ఘటన కళ్లెదుట నిలుస్తుంది.


ఏ పాపం తెలియని ఆ పసివాళ్ళు, భవిష్యత్తులో ఎటువంటి మానసిక సంఘర్షణకు గురవుతారో, సమాజంలో ఎలా ఇమడగలుగుతారో అనే ప్రశ్నలు మనసును కలచివేస్తాయి. ఈ పరిస్థితులను అరికట్టే బాధ్యత కేవలం వ్యక్తిగత కుటుంబాలపైనే కాకుండా, పోలీసులు, ప్రభుత్వం.. సమాజంపై ఉంది. ఇలాంటి దారుణాలను నివారించడానికి, కుటుంబాల్లో సఖ్యతను పెంపొందించడానికి, మానసిక సంక్షోభంలో ఉన్నవారికి సరైన మార్గదర్శకత్వం అందించడానికి సామూహిక కృషి అవసరం. లేదంటే ఇలాంటి సంఘటనలు పెరిగి, అనేక అమాయక బాల్యాలు అంధకారంలోకి కూరుకుపోతాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa