నగరంలో హైడ్రా పనితీరును బెంగళూరు లేక్స్ డిపార్ట్మెంట్ ఇంజినీర్ల బృందం మంగళవారం పరిశీలించింది. చెరువుల పరిరక్షణ,పునరుద్ధరణ, అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో వీక్షించింది. పాతబస్తీలో బమృక్నుద్దౌలా చెరువుతో పాటు.. అంబర్పేటలోని బతుకమ్మకుంటను సందర్శించింది. చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులు చేపట్టక ముందు, తాజా పరిస్థితులను గమనించింది. చెరువుల్లో ఆక్రమణలను తొలగించిన తీరును తెలుసుకుంది. నీటి జాడ లేని చెరువులను అభివృద్ధి చేసిన తీరును అభినందించింది. వరదల నివారణకు చెరువుల ప్రాధాన్యత ఎంతో ఉందని వివరించింది. చెరువులను అనుసంధానం చేసే నాలాలను కూడా పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయ పడింది. ఇందుకు హైడ్రా చేపట్టిన చర్యలను పరిశీలించింది.
అంబర్పేటలో ముల్లపొదలతో, పిచ్చి మొక్కలతో పూర్తిగా కప్పేసిన చెరువును పునరుద్ధరించిన తీరు ఆసక్తిగా ఉందని ఇంజినీర్లు అన్నారు. ఆక్రమణలను తొలగించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో వాకబు చేశారు. బతుకమ్మ కుంట అని పేరు ఎందుకు వచ్చింది. మరి ఆ చెరువు ఎలా పూడ్చివేశారు ఇలా అనేక విషయాలను తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో చెరువు పునరుద్ధరణ, అభివృద్ధిని చూసి ముచ్చట పడ్డారు. పాతబస్తీలోని బమృక్నుద్దౌలా చెరువు గొప్పతనాన్ని తెలుసుకున్నారు. వనమూలికల మెక్కలు, చెట్ల కొమ్మలు వేసిన ఈ చెరువు దిగువున ఊట బావి నీటిని నిజాం నవాబులు తాగునీటిగా వినియోగించిన చరిత్రను తెలుసుకుని ముచ్చట పడ్డారు. ఇలాంటి చరిత్ర ఉన్న చెరువులను పునరుద్ధరించిన హైడ్రాకు అభినందనలు తెలిపారు.
చెరువుల సందర్శన అనంతరం కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన చీఫ్ ఇంజినీర్ హరిదాసు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు నిత్య, భూప్రద, మహదేవ్లతో పాటు ఆ రాష్ట్ర ప్రతినిధులు హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారితో బేటీ అయ్యారు. హైడ్రా గురించి విన్నాం.. పత్రికల్లో చదివాం.. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. నగరంలో పూర్తిగా కనుమరుగైన, కాలుష్యం భారిన పడిన చెరువులను అభివృద్ధి చేస్తున్న తీరు బాగుందన్నారు. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలతోపాటు.. ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను పరిరక్షించడం కత్తిమీద సాములాంటిదని.. అనతి కాలంలోనే చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ అంటే ఏంటో ప్రజలు తెలుసుకునేలా చేశారంటూ ప్రశంసించారు. హైడ్రా వంటి సంస్థ అన్ని రాష్ట్రాలకూ అవసరమని అన్నారు. బెంగళూరులో చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. 2006 నుంచి చెరువుల హద్దులను నిర్ధారించి ఫెన్సింగ్ వేయడం ద్వరా కబ్జా కాకుండా చూస్తున్నామన్నారు. కాలువలు కబ్జాకు గురి అవ్వడంతోనే వరదలు వస్తున్నాయని.. త్వరలోనే ఈ సమస్యకు కర్ణాటక ప్రభుత్వం పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకుంటోందన్నారు. బెంగళూరులో చెరువులను హైడ్రా కమిషనర్ సందర్శించినప్పటి చిత్రాలతో కూడిన ఫొటో ఫ్రేంను శ్రీ రంగనాథ్గారికి ఇంజినీర్ల బృందం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa