జీవితం ఎన్నో ఒడిదుడుకులను, ఊహించని విషాదాలను తీసుకురావచ్చు. ఆ బాధల నుంచి బయటపడి తమను తాము నిరూపించుకోవడమే గొప్ప వ్యక్తుల లక్షణం. అలాంటి వారు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఆ కోవకు చెందినవారే ఆదిలాబాద్ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన రావుల సూర్యనారాయణ. గుండెను పిండేసే విషాదాలను ఎదుర్కొని 62 ఏళ్ల వయసులో ICET పరీక్షలో 178వ ర్యాంకు సాధించి ఆయన యువతరానికి ఆదర్శంగా నిలిచారు.
రావుల సూర్యనారాయణది మధ్య తరగతి కుటుంబం. భార్య సునీత, ఇద్దరు కుమారులతో సాఫీగా సాగిపోతున్న జీవితం. ఆయన ఎల్ఐసీలో సహాయ పాలనాధికారిగా, భార్య గవర్నమెంట్ టీచర్‌గా, పెద్ద కుమారుడు శశాంక్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా, చిన్న కుమారుడు శరణ్ ఎంబీబీఎస్ చుదవుతూ హాయిగా సుఖంగా జీవిస్తున్నారు. ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకపోవటంతో 2020లో సూర్యనారాయణ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందాడు. అయితే విధి వక్రించి ఆ కొద్దికాలానికే వారి జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఎంబీబీఎస్ చదువుతున్న చిన్న కుమారుడు శరణ్ అనారోగ్యంతో అకాల మరణం చెందాడు. ఈ దుఃఖం నుండి తేరుకోకముందే.. కరోనా మహమ్మారి వారి కుటుంబాన్ని కబళించింది. ఆయన భార్య సునీతను బలి తీసుకుంది. ఈ వరుస విషాదాలు సూర్యనారాయణను తీవ్ర కుంగుబాటుకు గురిచేశాయి. ఆ బాధ నుండి తేరుకునేందుకుమహారాష్ట్ర పర్బణీలో విధులు నిర్వహిస్తున్న పెద్ద కుమారుడి వద్దకు వెళ్లారు.
అదే సమయంలో ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోయామని విద్యార్థులు, పోటీ పరీక్షల్లో విఫలమయ్యామని నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు సూర్యనారాయణను తీవ్రంగా కలచివేశాయి. ఎందరో జీవితాలకు భద్రత కల్పిస్తున్న ఎల్ఐసీ సంస్థలో ఉద్యోగం చేసిన తాను.. భావితరానికి ప్రాణాల విలువను, ఓటమిని తట్టుకునే శక్తిని తెలియజెప్పాలని బలంగా నిర్ణయించుకున్నారు. వయసు పరిమితి లేని ఐసెట్ పరీక్ష రాయడానికి పుస్తకాలను ముందేసుకున్నారు. ఆయన పట్టుదల, కృషికి ఫలితం దక్కింది. కిందటేడాది (2024) తొలి ప్రయత్నంలోనే 1,828 ర్యాంకు తెచ్చుకున్నారు.
మరో ప్రయత్నంగా ఈసారి పరీక్షలు రాయగా.. 178 ర్యాంకుతో సత్తా చాటారు. చిన్న పరాజయం ఎదురైతే తనువు చాలిస్తున్న పిల్లలను చూస్తుంటే తన మనసు తల్లడిల్లుతోందని సూర్యనారాయణ వాపోయారు. అలాంటి వారిలో ఒక్కరైనా తనను స్ఫూర్తిగా తీసుకుంటారేమోననే ఆశతోనే ఐసెట్ పరీక్షలు రాసినట్లు చెప్పారు. ఈ పరీక్షలకు తాను మూడు నెలలపాటు సన్నద్ధమయ్యానని.. రోజూ 3-4 గంటలు యూట్యూబ్ సాయంతో పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేసినట్లు చెప్పారు. ఇలా సూర్యనారాయణ విషాదాలను జయించి విజేతగా నిలిచారు. పోటీ ప్రపంచంలో ఒత్తిడితో నిరాశకు లోనవుతున్న యువతకు గొప్ప సందేశం ఇచ్చారు. ఓటమి తాత్కాలికమనేనని.. అది విజయానికి ఒక మెట్టు లాంటిందని ఆయన నిరూపించి ఎందరికో స్పూర్తిగా నిలిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa