తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్‌రావు లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రాంచందర్‌రావు ఈ చర్యకు పూనుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీ ప్రమోషన్లు ఇస్తోందని.. దళితులు, ఆదివాసీల పట్ల బీజేపీకి గౌరవం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమకు పరువు నష్టం కలిగించేవిగా భావించిన రాంచందర్‌రావు, తన న్యాయవాది విజయకాంత్ ద్వారా ఈ నోటీసులు జారీ చేయించారు.
రాంచందర్‌రావు పంపిన లీగల్ నోటీసులో.. భట్టి విక్రమార్క తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకొని.. మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో.. రూ. 25 లక్షల పరువు నష్టం దావా వేస్తామని, అంతేకాకుండా క్రిమినల్ కేసులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసులో స్పష్టం చేశారు.
రోహిత్ వేముల కేసు దర్యాప్తు ఇప్పటికే ముగిసిందని.. ఈ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కాదని కోర్టులో తేలిన తర్వాత కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని రాంచందర్‌రావు విమర్శించారు. దళిత సమాజాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలని ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ లీగల్ నోటీసుతో తెలంగాణ రాజకీయాల్లో రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో PhD విద్యార్థిగా ఉన్న రోహిత్.. 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ముఖ్యంగా విద్యా సంస్థలలో దళితుల పట్ల వివక్ష, అణచివేతపై పెద్ద ఎత్తున చర్చను రేకెత్తించింది. రోహిత్ ఆత్మహత్య తర్వాత అతని కుల గుర్తింపుపై తీవ్ర వివాదం చెలరేగింది.
రోహిత్ వేముల మరణం భారతీయ సమాజంలో కుల వివక్ష సమస్యను మరోసారి హైలైట్ చేసింది. అతని జ్ఞాపకార్థం అనేక దళిత, విద్యార్థి సంఘాలు, పౌర హక్కుల కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన విద్యా సంస్థలలోని వివక్ష, అసమానతలపై లోతైన చర్చకు దారితీసి.. సామాజిక న్యాయం కోసం నిరంతర పోరాటానికి ప్రేరణగా నిలిచింది. ఇదిలా ఉండగా.. త్వరలోనే తెలంగాణలో 'రోహిత్ వేముల చట్టం' తీసుకువస్తామని, ఇది కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతుందని భట్టి విక్రమార్క ఇటీవల పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో కుల, ఆర్థిక, మతపరమైన వివక్షను రూపుమాపేందుకు కర్ణాటక ప్రభుత్వం రోహిత్ వేముల బిల్లును తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa