హైదరాబాద్లో నివసించే వారికి.. ముఖ్యంగా నీటి ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్న ఇళ్ల యజమానులకు వాటర్ బోర్డు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. నగరంలో సరిపడా వర్షాలు కురవకపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటిపోయాయి. ఈ పరిస్థితితో నగరం అంతటా నీటి ట్యాంకర్ల బుకింగ్లు విపరీతంగా పెరిగాయి. ఇది వాటర్ బోర్డుకు ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300 గజాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని జలమండలి స్పష్టం చేసింది. ఈ నిబంధనను పాటించని వారికి.. అంటే ఇంకుడు గుంత లేకుండా నీటి ట్యాంకర్లను బుక్ చేసుకున్న వారికి, ట్యాంకర్ల ధరలను పెంచుతామని వాటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల క్షీణత నేపథ్యంలో.. భవిష్యత్తులో భూగర్భ జల మట్టాలను పెంచే లక్ష్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఈ చర్య ప్రస్తుత నీటి కొరతను అధిగమించడమే కాకుండా.. దీర్ఘకాలికంగా నగరానికి నీటి భద్రతను కల్పించే ఒక వ్యూహాత్మక చర్యగా తెలుస్తోంది.
గత ఏడాది జూలై నెలతో పోలిస్తే.. ప్రస్తుత జూలైలో హైదరాబాద్లో ట్యాంకర్ల బుకింగ్లు 36 శాతం పెరిగాయి. గత సంవత్సరం జూలై 1 నుండి 14వ తేదీ వరకు 63,724 ట్యాంకర్లు బుక్ కాగా.. ఈ ఏడాది అదే కాలంలో 86,520 ట్యాంకర్లు బుక్ అయ్యాయి. అంటే.. దాదాపు 22,796 ట్యాంకర్ల బుకింగ్లు అదనంగా జరిగాయి. ఇది సుమారు 36 శాతం పెరుగుదల. ప్రస్తుతం జలమండలి పరిధిలో దాదాపు 1,135 నీటి ట్యాంకర్లు సేవలు అందిస్తున్నాయి. ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పనిసరి కావడం, లేనిపక్షంలో ధరలు పెరగడం వంటి చర్యలు ప్రజల్లో ఇంకుడు గుంతల ఏర్పాటుపై అవగాహన పెంచి, ఆచరణలో పెట్టేందుకు దోహదపడతాయని అధికారులు ఆశిస్తున్నారు.
ఇంకుడు గుంతలు వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి, భూగర్భ జల మట్టాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో కాంక్రీట్ నిర్మాణాలు పెరిగి, సహజంగా నీరు భూమిలోకి ఇంకే అవకాశం తగ్గింది. దీనివల్ల వర్షపు నీరు వృథాగా ప్రవహించి మురుగునీరుగా మారుతోంది. ఇంకుడు గుంతలు ఈ నీటిని సేకరించి, భూమిలోకి పంపి, భవిష్యత్ అవసరాల కోసం జలవనరులను పునరుజ్జీవింపజేస్తాయి. ఈ చర్యలు కేవలం వ్యక్తిగత ఇంటికే కాకుండా, మొత్తం నగరానికి దీర్ఘకాలికంగా నీటి భద్రతను అందిస్తాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నీటి సంరక్షణ పట్ల ప్రజల్లో బాధ్యతను పెంపొందించడమే కాకుండా.. పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది. వర్షాకాలంలో కురిసే ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa