తెలంగాణ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు తగిన దిగుబడి రాక నిరాశ చెందుతున్న పరిస్థితులకు ఇకపై తెరపడనుంది. భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు చీడపీడలను తట్టుకుని.. దిగుబడిని గణనీయంగా పెంచే కొత్త రకం వరి వంగడాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇదే సమయంలో.. ఇక్రిశాట్ (అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ) కూడా 'ర్యాపిడ్ రాగి' అనే నూతన వంగడాన్ని రూపొందించి.. చిరుధాన్యాల సాగులో నూతన ఆశలు రేపుతోంది.
వరి దిగుబడిలో సరికొత్త రికార్డు..
సాధారణంగా ఒక ఎకరం వరి పొలంలో 150-200 వడ్ల గింజలతో 2 నుంచి 2.5 టన్నుల దిగుబడి వస్తుంటుంది. గత సంవత్సరం అక్టోబర్‌లో విడుదలైన డీఆర్‌ఆర్ ధాన్ 75, 76 రకాల్లో కంకికి 450-500 గింజలు వచ్చి 3.5 నుంచి 4.5 టన్నుల దిగుబడిని ఇచ్చాయి. ఇప్పుడు, ఐఐఆర్‌ఆర్ శాస్త్రవేత్తలు దీనికి రెట్టింపు స్థాయిలో కంకికి వెయ్యి గింజలతో.. ఎకరానికి 10 టన్నుల భారీ దిగుబడిని సాధించే దిశగా కొత్త వరి వంగడాన్ని సిద్ధం చేస్తున్నారు.
"కంకికి వెయ్యి గింజలతో ఎకరం విస్తీర్ణం గల భూమిలో పది టన్నులు పండే వరి వంగడం 2027 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేవాలని సంకల్పించాం" అని ఐఐఆర్‌ఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై ప్రాథమిక ప్రయోగాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తుది ఫలితాలు వచ్చాక, మరో రెండేళ్ళలో ఈ వంగడాలు రైతులకు అందుబాటులోకి వస్తాయి. హైబ్రిడ్ విధానంలో కాకుండా.. సంప్రదాయ రకాల కలయిక ద్వారా ఈ కొత్త రకాన్ని సృష్టిస్తున్నారు.
తక్కువ కాలవ్యవధిలో సాగయ్యే సన్న రకంగా, తెగుళ్లను తట్టుకునే విధంగా, గ్లూకోజ్ శాతం తక్కువగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఇది వరి సాగులో ఒక కొత్త చరిత్రను సృష్టిస్తుందని, ప్రస్తుతం చైనాలో హైబ్రిడ్ వరి ఎకరానికి 6 టన్నులు వస్తుంటే, దాన్ని అధిగమించి రైతులకు ఉత్పాదకతను, దేశానికి ఆహార భద్రతను రెట్టింపు చేస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రకం విత్తనోత్పత్తికీ ఇది అనుకూలం.
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలకు సంపూర్ణ పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు (మిల్లెట్స్) పరిష్కార మార్గంగా మారుతున్నాయి. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఊదలు, సామలు, అరికెలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. ఇక్రిశాట్ రాగులపై విస్తృత పరిశోధనలు చేసి, 'ర్యాపిడ్ రాగి' అనే పేరుతో ఒక కొత్త వంగడాన్ని అభివృద్ధి చేసింది.
మన దేశంలో జొన్న.. సజ్జల తర్వాత మూడవ అత్యంత ముఖ్యమైన చిరుధాన్యంగా రాగి పంట గుర్తింపు పొందింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో లక్ష ఎకరాల్లో.. తెలంగాణలో 13,000 ఎకరాల్లో రాగి సాగవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వంగడాలతో పంట కాలం 135 రోజులుగా ఉండటంతో ఏడాదికి రెండు పంటలు మాత్రమే సాధ్యమవుతున్నాయి. ర్యాపిడ్ రాగి వంటి కొత్త వంగడాల వల్ల పంట కాలాన్ని తగ్గించి, అధిక దిగుబడులు సాధించే అవకాశం లభిస్తుంది. ఈ పరిశోధనలు తెలంగాణ వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిచ్చి, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa