ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ఆ విమానాశ్రయ నిర్మాణానికి వేగంగా అడుగులు.. రూ.205 కోట్లు విడుదల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 25, 2025, 08:25 PM

తెలంగాణ రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిలో భాగంగా మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. భూసేకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.205 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది మామునూరు విమానాశ్రయం నిర్మాణంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది. ఇటీవలే, విమానాశ్రయ నిర్మాణానికి భూములిస్తున్న రైతులకు ఎకరానికి రూ.1.20 కోట్లు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా.. ప్లాట్లు, ఇళ్లకు కూడా న్యాయమైన పరిహారం అందించే ప్రతిపాదనకు భూ బాధితుల నుంచి సానుకూల స్పందన లభించింది. గత నెల రోజులుగా వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద, వరంగల్ ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంలో విజయవంతమయ్యారు.


తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్న మామునూరు ఎయిర్‌పోర్టుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. చివరి నిజాం కాలంలో.. దాదాపు 706 ఎకరాల విస్తీర్ణంలో ఒక విమానాశ్రయం ఇక్కడ నిర్మించబడింది. 1930ల నాటి భారత్-చైనా యుద్ధం సమయంలో.. ఈ మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ను ప్రభుత్వ విమానాల కోసం ఒక కీలకమైన హ్యాంగర్‌గా వినియోగించారు. ఆ కాలంలో ఇది దేశంలోని అతిపెద్ద రన్‌వేలలో ఒకటిగా కూడా గుర్తింపు పొందింది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌ను ఇప్పుడు ఒక ఆధునిక విమానాశ్రయంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది.


 దీని కోసం ఇప్పటికే ఉన్న విస్తీర్ణానికి అదనంగా మరో 253 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. ఈ విస్తరణతో కలిపి, మామునూరు విమానాశ్రయాన్ని పూర్తి స్థాయి ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నిధులు భూసేకరణ.. రన్‌వే విస్తరణ, టెర్మినల్ భవనాల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడతాయి. మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయితే.. వరంగల్ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయి.


మామునూరుతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగ విమానయాన కనెక్టివిటీని పెంపొందించడానికి మరిన్ని విమానాశ్రయాల నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఈ ప్రణాళికలో భాగంగా.. ఆదిలాబాద్‌లో కూడా మరో ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టబోతున్నారు. తాజాగా ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు ఎయిర్‌ఫోర్స్ గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎయిర్ పోర్ట్ కోసం 1500 ఎకరాలను సేకరించనున్నారు. ఈ విమానాశ్రయాల నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంతో పాటు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పిస్తుంది. ముఖ్యంగా.. ప్రాంతీయ కనెక్టివిటీని పెంపొందించి, వాణిజ్యం, పర్యాటక రంగాలను అభివృద్ధి చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa