ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాటా సంస్థ ఆధ్వర్యంలో పటాన్చెరు ఐటిఐ లో నూతన కోర్సులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 26, 2025, 12:00 PM

రామచంద్రాపురం  : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను టాటా సంస్థ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతుందని.. ఆధునిక పారిశ్రామిక రంగానికి అనుగుణంగా నూతన కోర్సులు ప్రారంభించడంతోపాటు ప్రాంగణ నియామకాల ద్వారా ప్రముఖ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.  రామచంద్రపురం డివిజన్ పరిధిలోని పటాన్చెరు ఐటిఐ ప్రాంగణంలో నూతన కోర్సులకు సంబంధించిన బ్రోచర్ ను శనివారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐటిఐ ఆవరణలో టాటా సంస్థ ఆధ్వర్యంలో  నూతనంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఐటిఐ తో పాటు ఏటీసీ లో విద్యార్థులకు అందిస్తున్న కోర్సులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియాలోనే అతి పెద్ద పరిశ్రమిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు. ఆయా పరిశ్రమలలో స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో ఐటిఐ తో పాటు ఏటీసీ సెంటర్లు శిక్షణ కేంద్రాలకు ఉపయోగపడతాయని తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటిఐ, ఏటీసీ సెంటర్లలో శిక్షణ అందించడం ద్వారా వారిని నిపుణులైన ఉద్యోగులుగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని తెలిపారు. 


టాటా సంస్థ తమ సామాజిక బాధ్యతలో భాగంగా 42 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 10 వేల అడుగుల విస్తీర్ణంలో ఆధునిక యంత్ర సామాగ్రితో శిక్షణ కేంద్రాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాల పాటు టాటా సంస్థ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుందని తెలిపారు. 


ప్రధానంగా ప్రస్తుత మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆరు కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకుని వచ్చారని తెలిపారు. 


ఎలక్ట్రికల్ వెహికల్ (ఈవి) రిపేరింగ్, అడ్వాన్స్ సిఎంసి మిషన్, ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రోబోటిక్, ఆర్టిసియన్ యూజ్డ్ అడ్వాన్స్ టూల్స్ కోర్స్, బేసిక్ డిజైన్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ కోర్స్, వడ్డువేరు ఉత్పత్తుల రంగంలో ఉండే వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు మరమ్మతులు అంశాల్లో కోర్సులు ప్రవేశపెట్టారని తెలిపారు. పదవ తరగతి పాసైన ప్రతి విద్యార్థి ఈ కోర్సులు చేయడానికి అర్హులని తెలిపారు.  ప్రతి సంవత్సరం పైన పేర్కొన 6 కోర్సుల్లో 240 మంది విద్యార్థులు చదువుకోవచ్చని తెలిపారు. 


ఐటిఐ తో పాటు ఇప్పటికే పటాన్చెరు పటంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తరగతుల సైతం ప్రారంభమయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలోని విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బంగారు భవితకు బాటలు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు..ఇక నుండి ప్రతి సంవత్సరం టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు..ఐటిఐ ప్రాంగణంలో పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. అతి త్వరలో ప్రతి సమస్యను పరిష్కరించి రాష్ట్రంలోని ఆదర్శ ఐటిఐగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. 


ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, రామచంద్రపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్,. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, దశరథ్ రెడ్డి, టీజీఐఐసి  జోనల్ మేనేజర్ రతన్ రాథోడ్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ వీర మల్లేష్, పరమేష్ యాదవ్, ప్రమోద్ గౌడ్, ఐలేష్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa