తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించడంతో.. రాష్ట్రపతి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలతో తెలంగాణ న్యాయవ్యవస్థకు మరింత బలం చేకూరనుంది. కొత్త న్యాయమూర్తులుగా గాడి ప్రవీణ్‌కుమార్, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గౌస్ మీరా మొహుద్దీన్‌లు త్వరలో ప్రమాణం చేయనున్నారు.
కొత్త ప్రధాన న్యాయమూర్తి..
ఇటీవలే తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన జులై 19వ తేదీన రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డీజీపీ జితేందర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు.
జస్టిస్ ఏకే సింగ్ త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి, బదిలీపై తెలంగాణకు వచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన తెలంగాణ హైకోర్టుకు ఏడో ప్రధాన న్యాయమూర్తి. గతంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ సుజోయ్ పాల్ బదిలీల్లో కలకత్తా హైకోర్టుకు వెళ్లారు. జస్టిస్ సింగ్ 1965లో జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొంది, 1990 నుంచి 2000 వరకు ఉత్తరప్రదేశ్ హైకోర్టులో, ఆ తర్వాత 2001 నుంచి జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 2012లో జార్ఖండ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2022 నుంచి 2023 వరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023 ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీలు..
ఈ కొత్త నియామకాలతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య కొంత పెరుగుతుంది. అయితే.. ఇప్పటికీ తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీలు గణనీయంగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా.. కొత్త నియామకాలతో సహా ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుకుంటుంది. దీని అర్థం.. ఇంకా 12 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ ఖాళీల కారణంగా కోర్టులో కేసుల విచారణ ఆలస్యం అవుతోంది. ఇది న్యాయం కోరే పౌరులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. న్యాయమూర్తుల కొరత వల్ల ఉన్న న్యాయమూర్తులపై పని భారం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కొత్త నియామకాలు కొంతవరకు పని భారాన్ని తగ్గించినా.. మిగిలిన ఖాళీలను త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా న్యాయవ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసి.. ప్రజలకు సత్వర న్యాయం లభిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa