తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన వేలాది కుటుంబాలు ప్రస్తుతం ఒక సందిగ్ధంలో ఉన్నాయి. తమకు కొత్తగా కార్డులు వచ్చినా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో.. ఎవరికి దరఖాస్తులు సమర్పించాలో తెలియక సతమతం అవుతున్నాయి. గతంలో రేషన్ కార్డులు లేని కారణంగా ఎన్నో ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండిపోయిన వారికి.. ఇప్పుడు ఈ కొత్త కార్డులు రావడంతో ఎంతో ఉపశమనం లభించింది.
ముఖ్యంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. దాదాపు ప్రతీ పథకానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుండటంతో.. కొత్తగా కార్డులు పొందిన వారు వాటికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఈ ప్రక్రియ వారికి గందరగోళంగా మారింది. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డుదారుల కోసం ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల వారికి సంక్షేమ పథకాలను మరింత సులభతరం చేయనుంది.
ప్రత్యేక డ్రైవ్ ద్వారా దరఖాస్తులు..
రాష్ట్రంలో కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు సర్కార్ సిద్ధమైంది. ప్రతి పథకంతో పాటు.. ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సలకు కూడా రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో.. కొత్తగా కార్డులు పొందుతున్న వారికి ప్రభుత్వ పథకాలు అందేలా ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. కొత్తగా దాదాపు 7 లక్షల వరకు రేషన్ కార్డులు మంజూరయ్యాని తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న వివిధ గ్యారంటీ పథకాలను కొత్త రేషన్ కార్డుదారులకు కూడా అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్), ఇందిరమ్మ ఇళ్లు (గృహనిర్మాణ పథకం), మహాలక్ష్మి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.2500 ఆర్థిక సాయం), చేయూత (వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లు) తదితర పథకాల కోసం ఈ కొత్త లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది.
దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈ డ్రైవ్‌లో భాగంగా.. అధికారులే నేరుగా లబ్ధిదారుల నివాసాల వద్దకు వెళ్లి, వారి వివరాలను నమోదు చేసుకుని.. అవసరమైన అనుసంధాన ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనివల్ల లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే.. తమకు అర్హత ఉన్న పథకాల సేవలను పొందగలుగుతారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.
లబ్ధిదారుల సంఖ్య పెరుగుదల..
గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90.10 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉండగా.. 2.84 కోట్ల మంది వివిధ పథకాల కింద లబ్ధిదారులుగా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటివరకు కొత్తగా 3.50 లక్షలకు పైగా రేషన్ కార్డులను మంజూరు చేసింది. మొత్తంగా 7 లక్షల కుటుంబాలకు కొత్తగా కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త కార్డుల కింద 30 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉంటారని అంచనా. ఈ లబ్ధిదారులందరినీ ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం పక్కాగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ కీలక నిర్ణయం వల్ల రేషన్ కార్డులు లేని కారణంగా ఇంతకాలం ప్రభుత్వ పథకాలు అందని లక్షలాది మందికి ఇప్పుడు ఆర్థిక భరోసా లభిస్తుంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక పెద్ద ఊరట అని చెప్పవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa