ఆపిల్ ఉత్పత్తులు కేవలం మొబైల్ ఫోన్లు లేదా గాడ్జెట్లు మాత్రమే కాదు.. ఆధునిక సమాజంలో అవి ఒక హోదా చిహ్నంగా మారాయి. యాపిల్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయంటే.. అది వేరే లెవల్ అనుకోవాల్సిందే. అంతగా డిమాండ్ ఉంటాయి ఆ ప్రొడక్ట్స్‌కు. లక్ష రూపాయల విలువైన వేరే మోడల్ ఫోన్ చేతిలో ఉన్నా, కేవలం యాభై వేల ఆపిల్ ఐఫోన్ ఉంటేనే గొప్పగా భావించేవారు. కనీసం చేతికి యాపిల్ వాచ్ అయినా ఉండాలని కోరుకునేవారు అధికం. యాపిల్ వాడుతున్న వారిని ఒక విధంగా, వాడని వారిని మరో విధంగా చూసే ధోరణి కూడా ప్రస్తుత సమాజంలో ఉంది. ఈ విధమైన యాపిల్ అభిమానుల బలహీనతను ఆసరాగా చేసుకుని.. ఒక మోసగాళ్ల ముఠా చౌక ధరకే యాపిల్ ఉత్పత్తులు అంటూ ఆకర్షించి, నకిలీ వస్తువులను అమ్మి కోట్లలో దండుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ ఘటన వెలుగు చూసింది.
మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో కుప్పలుతెప్పలుగా నకిలీ యాపిల్ ఉత్పత్తులు బయటపడ్డాయి. పోలీసుల అంచనా ప్రకారం.. సుమారు రూ.3 కోట్ల విలువైన నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసగాళ్లు నకిలీ ఉత్పత్తులపై యాపిల్ స్టిక్కర్లను అతికించి, చూసేందుకు అచ్చం అసలైన యాపిల్ ఉత్పత్తి అనిపించేలా నమ్మబలికారు. అంతేకాదు.. ఆఫర్లో తక్కువ ధరకే అమ్ముతున్నాం అని నమ్మించి అమాయక ప్రజలను బురిడీ కొట్టించారు.
ఈ కేసులో షాప్ నిర్వాహకులు షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్ రాజ్‌పుత్ అనే ముగ్గురు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లను కొనుగోలు చేసి.. వాటిపై ఆపిల్ లోగో, స్టిక్కర్లను వేయడమే కాకుండా.. బాక్స్ ప్యాకేజింగ్‌ను కూడా అచ్చం అసలైన యాపిల్ ఉత్పత్తులను తలపించేలా తీర్చిదిద్దారు. ఆఫర్ల పేరిట తక్కువ ధరకే యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్, పవర్ బ్యాంక్‌లు, కేబుల్స్ వంటి వాటిని విక్రయిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఏకంగా 2,761 నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
అసలు నకిలీ గుర్తించడం కష్టం..
నిందితులను మీర్‌చౌక్ పోలీసులకు అప్పగించింది టాస్క్‌ఫోర్స్ బృందం. ఈ దాడులలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. యాపిల్ కంపెనీ ప్రతినిధులు కూడా టాస్క్‌ఫోర్స్ బృందంతో కలిసి పాల్గొన్నారు. నకిలీ ఉత్పత్తులు ఏవో, తమ ఒరిజినల్ ఉత్పత్తులు ఏవో కూడా యాపిల్ ప్రతినిధులు కూడా సులభంగా గుర్తించలేనంత నైపుణ్యంతో ఈ కేటుగాళ్లు వాటిని తయారు చేశారు. చివరకు.. వాటికున్న బార్‌కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారానే నకిలీ వస్తువులను గుర్తించగలిగారు.
చూసేందుకు అచ్చం యాపిల్ ఉత్పత్తుల వలె ఉన్నప్పటికీ.. మార్కెట్లో అసలు ఉత్పత్తి ధర లక్షల్లో ఉంటే, ఈ నకిలీ ఉత్పత్తులు మాత్రం వేల రూపాయలకే లభ్యమవుతాయి. "అంత పెద్ద బ్రాండ్ ఉత్పత్తిని ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతారు?" అని ఏమాత్రం ఆలోచించకుండా.. "తక్కువ ధరకు దొరికిందా, దానిపై యాపిల్ బ్రాండ్ ఉందా" అనే అంశాలకే ప్రాధాన్యతనిచ్చి యువత కొనుగోళ్లు చేస్తున్నారు. అది అసలైనదా కాదా..? ఎంత కాలం పనిచేస్తుంది, దాని మన్నిక ఎంత వంటి విషయాలను పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి, షాప్ గురించి ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా కొనేయడం యువతకు అలవాటుగా మారింది. వినియోగదారులు యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు అధికారిక స్టోర్లను, వెబ్ సైట్లను మాత్రమే సంప్రదించాలని, తక్కువ ధరలకు ఆశపడి మోసపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa