హైదరాబాద్ మహా నగరంపై ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించింది. ఎన్నడూ లేనంతగా ఆకాశం నుంచి నీళ్లు కుమ్మరిస్తున్నట్లు.. మేఘాలకు చిల్లు పడినట్లు నాన్‌స్టాప్‌గా వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మొదలైన ఈ వాన, నగరాన్ని అంధకారంలో ముంచేసింది. క్యూములోనింబస్ మేఘాలు ఆవరించడంతో.. పగటి పూట కూడా సాయంత్రం అయినట్లుగా వాతావరణం మారిపోయింది. జలపాతాల వద్ద ఎంత నీటిధార ఉంటుందో.. అంత ఎత్తున నీళ్లను ఆకాశం కుమ్మరించడంతో.. నగరంలోని వీధులన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రోడ్లన్నీ వాగులు, నదులను తలపించాయి. నగర శివార్ల నుంచి కేంద్రం వరకు వర్షం దంచి కొట్టింది.
ఐటీ కారిడార్ అతలాకుతలం..
ఈ భారీ వర్షం వల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వాహనదారులు ట్రాఫిక్ జామ్లలో చిక్కుకుపోయి నరకయాతన అనుభవించారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దూరంలో ఉన్న వాహనాలు, భవనాలు కూడా కనిపించనంతగా వర్షం పడింది. నాలాలు పొంగి ప్రవహించాయి.
ఐటీ కారిడార్ ప్రాంతాలైన గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రామ్‌గూడ, కొండాపూర్ వంటివి వర్షాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. అరగంట వాన పడితే చాలు.. ప్రధాన రోడ్లన్నీ చెరువుల్లా మారిపోతాయి. సోమవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. శిల్పారామం ఎదురు బస్టాప్, కొత్తగూడ బస్టాప్, మాదాపూర్ బాటా షోరూం, నెక్టార్ గార్డెన్, రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద, బయోడైవర్సిటీ జంక్షన్, ఐఐఐటీ ఎదురుగా, గచ్చిబౌలి ఏఈ ఆఫీస్, రాడిసన్ హోటల్, ఐకియా వెనకాల రోడ్డుపై వరద నీరు నిలిచిపోవడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ క్లియర్ కాలేదు.
మూడు, నాలుగు లేన్ల రోడ్డులో కార్లు, బస్సులు, బైక్‌లు ఒకటి, రెండు లేన్లలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేఎన్టీయూ నుంచి ఐకియా మీదుగా బయోడైవర్సిటీ రూట్, షేక్‌పేట్ నుంచి ఖాజాగూడ మీదుగా గచ్చిబౌలి రూట్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి రూట్ అంతా ట్రాఫిక్ నిలిచిపోయింది. లింగంపల్లి రైల్వే అండర్‌బ్రిడ్జి కూడా నీట మునిగింది. ఆఫీసుల నుంచి బయలుదేరిన సమయంలో వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన హైదరాబాద్ సిటీ పోలీసులు వెంటనే ప్రజలకు అత్యవసర సూచనలు జారీ చేశారు. భారీ వర్షం కురుస్తుండటంతో ఇళ్లల్లో ఉన్నవాళ్లు బయటికి వెళ్లవద్దని సూచించారు. అదే విధంగా ఆఫీసుల్లో ఉన్న వాళ్లు వర్షం పూర్తిగా నిలిచే వరకు బయలుదేరవద్దని హెచ్చరించారు. భారీగా వరద పారుతుండటంతో రోడ్లపై వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వర్షం తగ్గిన తర్వాతే ప్రయాణం చేయాలని సూచించారు.
నగరమంతటా ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు ఎక్కడ ఉన్నవారు అక్కడే సురక్షితంగా ఉండాలని కోరారు. ఏదైనా ప్రమాదానికి గురైతే.. తక్షణ సహాయం కోసం 100కు డయల్ చేయాలని సూచించారు. ఈ అకాల వర్షం క్లౌడ్ బరస్ట్ తరహాలో ఉందని నగరవాసులు అభిప్రాయపడ్డారు. పర్యావరణ మార్పుల నేపథ్యంలో ఇలాంటి అనూహ్య వాతావరణ పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa