ప్రతి ఒక్కరి కల సొంత ఇల్లు. దీనిని నిజం చేసుకోవడానికి చాలామంది తమ కష్టార్జితంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. సాధారణంగా.. వేతనం పొందే వ్యక్తులు నెలవారీ ఆదాయంలో 30 శాతం వరకు ఆదా చేసి.. ఆ తర్వాత స్థలం లేదా ఇంటిని కొనుగోలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఇల్లు కొనుగోలు చేసే వారికి అదనంగా ప్రభుత్వం తక్కువ ధరలకే ప్లాట్లను వేలం వేయడం వంటి కార్యక్రమాలు ఎంతో సహాయంగా నిలుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని రాజీవ్ స్వగృహ పథకం ద్వారా వేలం వేసిన ప్లాట్లకు తాజాగా భారీ స్పందన లభించింది. ఈ వేలంలో సుమారు రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని బహదూర్‌పల్లిలో ఉన్న రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ విషయాన్ని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం వెల్లడించారు. మేడ్చల్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ విలువ అంచనాలకు మించి పెరిగిందడంలో ఈ వేలం మరోసారి రుజువు చేసింది. మంగళవారం జరిగిన బహిరంగ వేలంపాటలో మొత్తం 68 ప్లాట్లకు గాను.. తొలి రోజు 50 ప్లాట్లకు వేలం నిర్వహించారు. రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ వేలంపాటలో గరిష్టంగా చదరపు గజం ధర రూ. 46,500 పలికినట్లు గౌతం తెలిపారు. వేలం నిర్వహించిన 50 ప్లాట్ల విక్రయం ద్వారా సుమారు రూ. 100 కోట్ల మేర ఆదాయం వచ్చిందని మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు.
సుమారు 119 మంది ఈ ప్లాట్లను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డారు. సగటున ప్రతీ ఒక్క ప్లాట్‌కు 30 మందికి పైగా పోటీ పడ్డారంటే.. వీటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా.. ఈ ప్లాట్లు ఔటర్ రింగ్ రోడ్డుకు(ఓఆర్ఆర్) అతి సమీపంలో ఉండటం కూడా ఈ భారీ డిమాండ్‌కు ఒక కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నిపుణులు చెబుతున్నారు. వేలంలో విక్రయించబడని ఈ ప్లాట్లు 200 నుంచి 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిలో కార్నర్ ఫ్లాట్‌కు రూ. 30,000.. మిడిల్, ఇతర ఫ్లాట్లకు రూ. 27,000 కనీస ధరగా నిర్ణయించారు. ఈ వేలంలో కార్నర్ ప్లాట్లకు అత్యధిక ధర పలకడం విశేషం.
ప్రభుత్వం ఈ రకమైన వేలం ప్రక్రియను చేపట్టడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన ఆదాయం వస్తుంది. మరోవైపు.. రియల్ ఎస్టేట్ వ్యాపార మార్కెట్‌లో పెరుగుతున్న ధరల నేపథ్యంలో.. ప్రభుత్వం తక్కువ ధరలకే ఈ ప్లాట్లను వేలం వేయడం వల్ల సామాన్య ప్రజలకు కూడా సొంతింటి కలను నిజం చేసుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా.. అభివృద్ధి చెందుతున్న నగరాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడం.. మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో ఇటువంటి వేలం పాటలు విజయవంతమవుతున్నాయి. హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాలు, ముఖ్యంగా మేడ్చల్, శంషాబాద్, నార్సింగి, కీసర వంటి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa