ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శుభవార్త చెప్పిన డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. ఇక నుంచి వారికి ఉచిత విద్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 10, 2025, 06:34 PM

కొంతమంది ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొందాలని ఆశపడతారు. అయితే ఆర్థిక, కుటుంబ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల చాలా మంది తమ చదువులను మధ్యలోనే ఆపేస్తుంటారు. అలాంటి వారిలో మహిళలు, మారుమూల ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇలా చదువుకు దూరమైన వారికి, ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలనుకునే వారికి డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం డిగ్రీ, పీజీ, డిప్లొమా వంటి అనేక కోర్సులకు అడ్మిషన్లు ప్రకటిస్తుంది. ఇప్పుడు.. ఒక కొత్త నిర్ణయంతో ఈ యూనివర్సిటీ మరింత మందికి చేరువ కానుంది.


ఆదివాసీ విద్యార్థులకు ఉచిత విద్య..


డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఆదివాసీ విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు ప్రకటించింది. యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఈ విషయాన్ని వెల్లడించారు. యూనివర్సిటీ గడిచిన నాలుగు దశాబ్దాలుగా లక్షలాది మందికి ఉన్నత విద్య అందించినా, ఇంకా కొన్ని వర్గాల ప్రజలు చదువుకు దూరంగా ఉన్నారని, అందులో ముఖ్యంగా ఆదివాసీ తెగలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సమస్యను గుర్తించిన యూనివర్సిటీ, వారికి ఉన్నత విద్యను అందించాలని నిర్ణయించుకుంది.


ప్రణాళిక లక్ష్యాలు, ప్రయోజనాలు..


యూనివర్సిటీ నినాదం "Education at your doorstep"కు అనుగుణంగా, మారుమూల ప్రాంతాల్లో కూడా స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ.. ఆదివాసీలకు ఇంకా పూర్తిస్థాయిలో చేరువ కాలేకపోయామని యూనివర్సిటీ అధికారులు గుర్తించారు. అందుకే వారికి ఆర్థిక భారం లేకుండా, చదువుకు కావలసిన వనరులు అందించడానికి ఈ ప్రణాళికను రూపొందించారు.


ఈ పథకం ప్రకారం.. ఆదివాసీ విద్యార్థులు ఎటువంటి బోధనా రుసుము (tuition fees) చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం రూ.500 నామమాత్రపు అడ్మిషన్ ఫీజుతో వారు డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. అంతేకాకుండా వారికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తారు. వసూలు చేసే ఆ డబ్బులు కూడా పుస్తకాల కోసమే అని తెలిపారు. రాష్ట్రంలోని గోండు, కోయ, చెంచు వంటి తెగలకు చెందిన విద్యార్థులకు ఈ పథకం అండగా నిలుస్తుంది. రాబోయే ఐదేళ్లలో కనీసం వెయ్యి మంది ఆదివాసీ విద్యార్థులను పట్టభద్రులుగా చూడాలని యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళిక వల్ల చదువుకు దూరంగా ఉన్న ఆదివాసీ యువత తమ కలలను సాకారం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇటీవల చదువుతో పాటే.. నెల నెలా స్టైఫండ్ పొందేందుకు ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.


ఈ ప్రణాళికలో చేరడానికి చివరి తేదీ ఆగస్టు 13. పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ హెల్ప్ డెస్క్ లేదా వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 40-23680333 / 040-23680555.. కాల్ సెంటర్ : 1800 5990 101 లేదా వెబ్ సైట్.. www.braou.ac.in | www.online.braou.ac.inను సంప్రదించవచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa