అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన (ఇంపీచ్‌మ అభిశంసన ప్రక్రియను ప్రారంభించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో భారీ మొత్తంలో కాలిపోయిన నగదు కట్టలు బయటపడిన ఘటన ఈ అభిశంసన ప్రతిపాదనకు దారితీసింది. ఈ ఆరోపణలపై విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కూడిన దర్యాప్తు కమిటీని స్పీకర్ ప్రకటించారు. ఈ తీర్మానానికి లోక్‌సభ, రాజ్యసభల నుంచి 209 మంది ఎంపీల మద్దతు లభించినట్లు తెలుస్తోంది.
ఈ దర్యాప్తు కమిటీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీనియర్ న్యాయవాది బి.వి. ఆచార్య సభ్యులుగా నియమితులయ్యారు. జడ్జిల విచారణ చట్టం-1968 ప్రకారం ఏర్పాటైన ఈ కమిటీ, జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలను లోతుగా విచారించి నివేదిక సమర్పించనుంది. కమిటీ నివేదిక వచ్చే వరకు అభిశంసన తీర్మానంపై తదుపరి చర్యలను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు.
ఈ ఘటన మార్చి 2025లో జస్టిస్ వర్మ ఢిల్లీలోని అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరిగిన సందర్భంలో కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడటంతో మొదలైంది. అంతర్గత విచారణలో ఈ నగదుపై జస్టిస్ వర్మకు నియంత్రణ ఉన్నట్లు తేలడంతో, భారత ప్రధాన న్యాయమూర్తి ఆయన తొలగింపును సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో, 146 మంది లోక్‌సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసిన అభిశంసన నోటీసును జులై 31న స్పీకర్‌కు సమర్పించారు. ఈ తీర్మానం భారత న్యాయవ్యవస్థ చరిత్రలో అరుదైన, రాజ్యాంగపరంగా కీలకమైన పరిణామంగా పరిగణించబడుతోంది.
కమిటీ నివేదిక ఆధారంగా ఆరోపణలు నిజమైనట్లు తేలితే, ఈ తీర్మానం పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ (హాజరై ఓటు వేసిన సభ్యుల్లో మూడింట రెండు వంతులు)తో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత, రాష్ట్రపతి ఆమోదంతో జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. జస్టిస్ వర్మ ఈ ఆరోపణలను ఖండిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, వారి పిటిషన్‌ను కొట్టివేయడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో సిట్టింగ్ జడ్జిపై అభిశంసన ప్రక్రియ మూడోసారి జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa