తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కుమారుడి ఉన్నత విద్య కోసం అమెరికా పర్యటనకు వెళ్లే ముందు, తన తండ్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కీలక సమావేశంలో పాల్గొన్నారు. సుమారు 15 రోజులు అమెరికాలో ఉండనున్న ఆమెకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఇప్పటికే అనుమతించింది. అమెరికా ప్రయాణానికి ముందు కవిత తన చిన్న కుమారుడితో కలిసి ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. తన కుమారుడికి తాత ఆశీర్వాదం తీసుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.
అయితే.. ఈ భేటీ కేవలం కుటుంబపరమైనది మాత్రమే కాదని, రాజకీయ ప్రాధాన్యత కలిగినదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె అమెరికాకు వెళ్లే ముందు పార్టీలో తన స్థానం, భవిష్యత్ వ్యూహాల గురించి చర్చించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే అమెరికాలో కవిత పెద్ద కుమారుడు విద్యను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కవిత రేపు ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు వెళ్లి.. పర్యటన ముగించుకుని సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.
కేటీఆర్ , హరీష్ రావు కూడా భేటీలో..
కవిత అమెరికా పర్యటనకు బయలుదేరడానికి ముందే కేసీఆర్ పార్టీలోని కీలక నేతలను.. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావులను కూడా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు పిలిపించారు. ఈ కీలక నేతలు ఒకే చోట సమావేశమవ్వడం పార్టీలో భవిష్యత్ వ్యూహాలపై తీవ్రంగా చర్చించుకుంటున్నారని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతంపై వారు చర్చించుకున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన రిపోర్ట్ వంటి కీలక అంశాలు కూడా చర్చకు వచ్చాయి. కవిత, కేటీఆర్‌ల మధ్య రాజకీయంగా దూరం పెరిగిందని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఈ భేటీ ఈ ఊహాగానాలకు తెరదించినట్లుగా భావించవచ్చు.
బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు..
2023 ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత, బీఆర్ఎస్ పార్టీ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా తమ పాత్రను ఎలా పోషించాలి.. రాబోయే ఎన్నికల్లో పార్టీని ఎలా సిద్ధం చేయాలి అనేది కేసీఆర్ ముందున్న ప్రధాన లక్ష్యాలు. కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత.. ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి తిరిగి వచ్చినా, పార్టీలో ఆమె స్థానంపై స్పష్టత లేదనే వాదనలు ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావులతో కలిసి కేసీఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, పార్టీలో సమష్టి నాయకత్వాన్ని కొనసాగించే ప్రయత్నంగా చూడవచ్చు. ఈ సమావేశం అనంతరం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా కొత్త వ్యూహాలతో ముందుకు వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa