హైదరాబాద్ డెవలప్‌మెంట్ అండ్ రీకన్స్ట్రక్షన్ అథారిటీ తన కార్యకలాపాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. పర్యావరణ పరిరక్షణ, ప్రజల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న హెచ్‌వైడీఆర్‌ఏ , ఇప్పటికే ఆరు చెరువులను అభివృద్ధి చేయగా.. మరో 13 చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిలో బతుకమ్మ కుంట పునరుద్ధరణ పనులు విశేష ప్రశంసలు అందుకున్నాయి. అయినప్పటికీ.. కొన్ని సామాజిక మాధ్యమాలు, స్వార్థ ప్రయోజనాలతో పనికట్టుకుని హెచ్‌వైడీఆర్‌ఏ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని హెచ్‌వైడీఆర్‌ఏ అధికారులు పేర్కొన్నారు.
తమ్మిడికుంట చెరువుపై ఆరోపణలు, వాస్తవాలు..
గతంలో మాదాపూర్‌లోని శిల్పారామం ముందు వర్షపు నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు సృష్టించేవి. దీనికి పరిష్కారంగా, ఆరు చెరువుల పునరుద్ధరణలో భాగంగా తమ్మిడికుంట చెరువును హెచ్‌వైడీఆర్‌ఏ పునరుద్ధరించింది. చెరువులో పూడిక తీసి, వరద కాలువను మళ్లించడం వల్ల ఇప్పుడు అక్కడ నీరు నిలవడం లేదు. ఈ చెరువు ఎఫ్‌టీఎల్ (Full Tank Level) విషయంలో కూడా హెచ్‌వైడీఆర్‌ఏ స్పష్టత ఇచ్చింది. హెచ్‌ఎండీఏ 2014లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ ద్వారా.. 2016లో ఫైనల్ నోటిఫికేషన్ ద్వారా తమ్మిడికుంట ఎఫ్‌టీఎల్‌ను 29.26 ఎకరాలుగా నిర్ధారించింది.
ఈ పరిధిలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగార్జున స్వచ్ఛందంగా భూమిని అప్పగించి, చట్టపరంగా పరిహారం తీసుకున్నారు. అయితే.. ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులు, హెచ్‌వైడీఆర్‌ఏ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ.. హెచ్‌వైడీఆర్‌ఏ ఎల్లప్పుడూ చట్టబద్ధంగానే వ్యవహరిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
గతంలో ఈవీడీఎం రంగులే.. అసహజ రంగులు లేవు..
గతంలో జీహెచ్ఎంసీలో భాగంగా ఉన్న ఈవీడీఎం వాహనాలకు వాడే రంగులే కొనసాగుతున్నాయి. 7 ఏళ్లుగా ఇవే రంగులు కొనసాగుతున్నాయనే విషయం మీడియా గుర్తించాలి. గతంలో ఈవీడీఎం అని ఉంటే.. ఇప్పుడు హైడ్రా పేరుతో ఉన్నాయి. అక్షరాలు మారాయి, లోగో మారింది తప్ప రంగు మారలేదు. అసహజ రంగులు ఎక్కడా లేవని పేర్కొంది. కానీ కొన్ని సామాజిక మాధ్యమాల్లో అసహజ రంగులాంటూ వార్తలు రావడం పట్ల విచారం వ్యక్తం చేసింది.
హైడ్రాకు సంబంధం లేకపోయినా..
కూకట్పల్లి - హైటెక్ సిటీ వంతెన వద్ద వర్షం నీరు నిలిచిపోతే ట్రాఫిక్, GHMC అధికారులు కలసి వంతెన పారాపెట్ వాల్ కి రంధ్రం చేసి నీటిని బయటకు పంపారు. ఇక్కడ వంతెన స్ట్రక్చర్ దెబ్బతినకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయాన్ని స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కూడా ధృవీకరించారు. సదుద్దేశంతో ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చేసిన పనికి లేనిపోని దురుద్దేశాలు ఆపాదించడం తగదు. ఈ పనితో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేకపోయినా హైడ్రాకు అంటకట్టి ఒక పద్ధతి ప్రకారం కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. గతంలోనూ అనేక అంశాలపై ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ప్రజలు ఈ విషయాలను అర్థం చేసుకోవాలని, వాస్తవాలను గ్రహించాలని హైడ్రా విజ్ఞప్తి చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa